Share News

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 11 మంది మృతి..

ABN , Publish Date - Aug 31 , 2026 | 08:30 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 11 మంది మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 11 మంది మృతి..
Firecracker Factory Blast

కౌశాంబి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 11 మంది మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన పిప్రి పోలీస్ స్టేషన్ పరిధి మనోరి గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను ప్రియాంజలి (5), ప్రవీణ్ సింగ్ (13), జహన్వి (12), ఆదిత్య (12), ఆదిత్య (8), రవి (8), అంజు (32), జ్ఞాన్ సింగ్ (40), విక్రమ్ సరోజ్ (35), అన్ష్ (6), నానా (4)గా పోలీసులు గుర్తించారు. మృతులంతా ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న వారేనని అధికారులు తెలిపారు.


సోమవారం మధ్యాహ్నం వేళ బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు స్థానికంగా బీభత్సం సృష్టించింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇళ్లని పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడిన 16 మందిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించగా.. 11 మంది చికిత్సపొందుతూ మరణించారని జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ పాల్ తెలిపారు. మరో ఐదుగురికి చికిత్స అందుతోందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 18 మందికి పైగా గాయపడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ వాటి కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి..

ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'కౌశాంబి జిల్లాలో ప్రమాదం తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశాం' అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సింధు జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన భారత్..

గ్రేటర్ నోయిడాలో నిర్భయలాంటి ఘటన.. కదిలే బస్సులో బాలికను..

Updated Date - Aug 31 , 2026 | 08:33 PM