ప్రధాని రేసులో విజయ్.. సర్వేపై రాజకీయ దుమారం
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:41 PM
ఇటీవలి 'ఇండియా టుడే - సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వే ఫలితాలలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థుల రేసులో మూడో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 31: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఇటీవల వెలువడిన 'ఇండియా టుడే - సీ ఓటర్ (Mood of the Nation)' సర్వే ఫలితాలలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థుల రేసులో మూడో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది. దీంతో తమిళగ వెట్రి కళగం (TVK) శ్రేణులు '2029లో విజయ్ ఫర్ పీఎం' అనే నినాదాన్ని బలంగా వినిపిస్తుండగా, దీనిపై రాష్ట్రంలో డీఎంకే, అధికార కూటమిలోని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.
విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడంపై డీఎంకే సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతి ఘాటుగా స్పందించారు. 'వారి ఊహలకు హద్దులు లేవు. తమ నాయకుడే రేపు ఐక్యరాజ్యసమితి అధిపతి అవుతాడని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు' అని ఎద్దేవా చేశారు. కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న సమయంలో విజయ్‌ను ప్రమోట్ చేయడం అంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మంత్రుల రాజీనామా హెచ్చరిక
విజయ్ మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ మంత్రి రాజేష్ కుమార్ స్పందిస్తూ.. 2029 సాధారణ ఎన్నికలలో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అనేది తమ పార్టీ స్పష్టమైన నిర్ణయమని తేల్చి చెప్పారు. TVK గనుక రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వకపోతే తమ కాంగ్రెస్ మంత్రులు తమిళనాడు క్యాబినెట్ నుంచి రాజీనామా చేస్తారని హెచ్చరించారు.
సర్వే విశ్వసనీయతపై విమర్శలు
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ ఎక్స్ (X) వేదికగా నక్క కథను ఉదహరిస్తూ పరోక్షంగా ఈ సర్వేపై విమర్శలు గుప్పించారు. 'ప్రతి సంఖ్య నిజం చెప్పదు, ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు' అంటూ సదరు సర్వే విశ్వసనీయతను ప్రశ్నించారు.
వైకో స్పందన
మరోవైపు MDMK అధినేత వైకో మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమికి రాహుల్ గాంధీ మినహా ప్రధాని అభ్యర్థిగా వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి విజయ్‌కే ప్రధాని కావాలనే కోరిక గానీ, ఆలోచన గానీ లేవని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవలే తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ అధికారంలోకి వచ్చిన విజయ్, సీఎంగా 100 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ 'విజయ్ ఫర్ పీఎం' ప్రచారం ఊపందుకోవడం, తూత్తుకుడి వంటి ప్రాంతాల్లో పోస్టర్లు వెలవడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరతీసింది.
ఇవి కూడా చదవండి...
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్