Share News

కాశ్మీరీ పండిట్లకు ఉగ్ర బెదిరింపులు.. ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం!

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:17 PM

కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు వచ్చిన ఉగ్ర బెదిరింపులపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులను ఆదేశించారు.

కాశ్మీరీ పండిట్లకు ఉగ్ర బెదిరింపులు.. ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం!
omar abdullah

జమ్మూకశ్మీర్‌, ఆగస్టు 14: కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు వచ్చిన ఉగ్ర బెదిరింపులపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పండిట్ ఉద్యోగుల భద్రతను తక్షణమే సమీక్షించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


లష్కరే తోయిబా (LeT) అనుబంధ ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన బెదిరింపు లేఖలో పలువురు కాశ్మీరీ పండిట్ ఉద్యోగుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉండటంతో లోయలో మళ్లీ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఉద్యోగులకు ఆగస్టు 25 వరకు అడ్మినిస్ట్రేటివ్ సెలవులు మంజూరు చేశారు. ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి పథకం కింద నియమితులైన ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఉన్నతాధికారులు సూచించారు. బెదిరింపు లేఖలో పేర్లు ఉన్నవారిని ఇప్పటికే జమ్మూకు తరలించారు.


సిఎం హెచ్చరిక:

గతంలో సాగిన లక్ష్యిత దాడులను (Targeted Killings) దృష్టిలో ఉంచుకుని, ఈ బెదిరింపులను తేలికగా తీసుకోకూడదని, ఉద్యోగుల కదలికలపై ఆంక్షలు విధించకుండా వారి రక్షణకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సిఎం ఒమర్ అబ్ధుల్లా ఆదేశించారు.


పీఎం ఉపాధి పథకం - గత చరిత్ర:

2010లో ప్రారంభించిన ప్రధాని ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ ద్వారా సుమారు 6,000 మంది కాశ్మీరీ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అయితే, 2022లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు పండిట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో వారిని జమ్మూ ప్రాంతానికి బదిలీ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత వారిని శ్రీనగర్, ఇతర ప్రధాన పట్టణాల్లోని సురక్షిత ప్రాంతాలకు మార్చారు. ప్రస్తుతం మళ్లీ బెదిరింపులు రావడంతో పోలీసులు విస్తృత విచారణ చేపట్టి భద్రతను పటిష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

Updated Date - Aug 14 , 2026 | 09:20 PM