విదేశాల్లో భారతీయులపై 7 రెట్లు పెరిగిన దాడులు
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:14 PM
విదేశాల్లో ఉంటున్న భారతీయులపై దాడులు గత ఐదేళ్లల్లో 7 రేట్లు పెరిగాయని విదేశాంగ శాఖ రాజ్యసభలో వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ఉంటున్న భారతీయులపై దాడులు గత ఐదేళ్లల్లో 7 రేట్లు పెరిగాయని విదేశాంగ శాఖ రాజ్యసభలో వెల్లడించింది. 2021లో విదేశాల్లో భారతీయులపై దాడులకు సంబంధించి 15 ఘటనలు వెలుగులోకి రాగా 2025 నాటికి ఈ సంఖ్య 104కు చేరింది.
భారతీయులపై హింసాత్మక దాడి ఘటనలు అత్యధికంగా యూఎస్, యూఏఈ, యూకే, కెనడాల్లో వెలుగుచూశాయి. మొత్తం 36 దేశాల గణాంకాలను విదేశాంగ శాఖ రాజ్యసభ ముందుంచింది. అమెరికాలో గత ఐదేళ్లల్లో భారతీయులకు సంబంధించి 33 కేసులు వెలుగు చూశాయి. యూఏఈలో 32 కేసులు, యూకేలో 31, కెనడాలో 30 కేసులు వెలుగు చూశాయి. ఇక ఐర్లాండ్‌లో గత ఐదేళ్లల్లో భారతీయులపై 24 హింసాత్మక దాడులు జరగ్గా, రష్యాలో 23, జర్మనీలో 19 ఉదంతాలు బయటపడ్డాయి. 2021-25 మధ్య కాలంలో మొత్తం 302 దాడి కేసులు వెలుగు చూడగా 2025లో అత్యధికంగా 104 హింసాత్మక ఘటనలు జరిగాయి.
భారతీయులపై హింసాత్మక దాడుల పెరుగుదలో ఏటా హెచ్చుతగ్గులు ఉన్నాయని గణాంకాల్లో తేలింది. యూఎస్‌ఏలో 2021లో ఒక్క ఘటన బయటపడగా, 2022లో ఆరు, 2023లో ఒకటి, 2024లో 11, 2025లో 14 దాడి ఘటనలు జరిగాయి. ఇక యూకేలో 2021లో ఒక దాడి ఘటన వెలుగు చూసింది. 2022లో నాలుగు ఉదంతాలు, 2023లో పదకొండు, 2024లో పది, 2025లో ఐదు వెలుగు చూశాయి. ఇక కెనడాలో 2021లో భారతీయులపై దాడులకు సంబంధించి మూడు కేసులు వెలుగు చూడగా2022, 2023 సంవత్సరాల్లో ఆరు కేసుల చొప్పున నమోదయ్యాయి. 2024లో ఏడు, 2025లో 8 దాడి ఘటనలు వెలుగు చూశాయి. మాలీలో 2021-24 మధ్య కాలంలో ఒక్క కేసు కూడా లేకపోగా 2025 ఏకంగా 11 కేసులు వెలుగు చూశాయి.
విదేశాల్లో భారతీయుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. భారతీయ ఎంబసీలు, సిబ్బంది అక్కడి భారతీయుల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వార్నింగ్
నాకు, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్