Share News

నాకు, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్

ABN , Publish Date - Aug 14 , 2026 | 02:20 PM

నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై చర్యలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిద్ధమైనందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నాకు, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
Chief Justice of India Suryakant

ఇంటర్నెట్ డెస్క్: నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై చర్యలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిద్ధమైనందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకూ, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకునేందుకు వారెవరని ప్రశ్నించారు.

2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా చేర్చుకోవద్దంటూ రాష్ట్ర కౌన్సిల్స్‌ను బీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఘటనపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీని కోరింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది.


ఈ పరిణామాలపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీసీఐ జోక్యం ఎంతమాత్రం అవసరం లేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని స్పష్టం చేశారు. బీసీఐకి ఈ అంశంలో ఎలాంటి నిమిత్తం లేదని అన్నారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని కూడా స్పష్టం చేశారు. బీసీఐ అనవసరంగా జోక్యం చేసుకుందని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నామని బీసీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది.

స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించడంపై అభ్యంతరం చెబుతూ యూనివర్సిటీ అధికారులకు సుమారు 450 మంది లేఖ రాయడంతో వివాదం మొదలైంది. పేపర్ లీక్‌పై ఛలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీం కోర్టు తీరును తప్పుబట్టిన విద్యార్థులు ఈ లేఖను రాశారు.


ఈ వార్తలనూ చదవండి:

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

వామ్మో దెయ్యం.. భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

Updated Date - Aug 14 , 2026 | 03:16 PM