Share News

వామ్మో దెయ్యం.. భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:23 PM

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు..

వామ్మో దెయ్యం..  భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు
Maharashtra Hostel Ghost Fear

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని మేల్ఘాట్ జిల్లా, చిఖల్దారా తాలూకాలో ఉన్న డోమా ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో ఒక వింత, భయానక సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో ఉన్నట్టుండి విచిత్రమైన లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఒక విద్యార్థిని కారణం లేకుండా ఏడవడం, బిగ్గరగా నవ్వడం, గట్టిగా అరవడం, స్పందన లేకుండా ఒక్కచోటే ఉండిపోవడం వంటి లక్షణాలకు గురైంది. అనతికాలంలోనే ఈ వింత ప్రవర్తన ఇతర విద్యార్థినులకు కూడా వేగంగా వ్యాపించడంతో, ఆవరణలో దెయ్యం తిరుగుతోందనే వదంతులు ఒక్కసారిగా దావానలంలా వ్యాపించాయి.


ఈ భయానక వాతావరణంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం పాఠశాలకు పరుగులు తీశారు. మొత్తం 608 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లడంతో శుక్రవారం నాటికి ఆశ్రమ పాఠశాల పూర్తిగా ఖాళీ అయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమరావతి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ బృందాన్ని పిలిపించినప్పటికీ, ఈ ప్రవర్తనకు గల మూల కారణాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే, ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కలిగే మాస్ హిస్టీరియా కావచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అంకిత్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు గ్రామాల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు కూడా కౌన్సెలింగ్ కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

అదానీకి భారీ ఊరట

Updated Date - Aug 14 , 2026 | 01:31 PM