మారువేషంలో బస్సు ఎక్కిన మంత్రి.. చిల్లర లేదని దింపేసిన కండక్టర్..
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:07 PM
బెంగళూరు నగర బస్సు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ మారువేషంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. చిల్లర లేదనే కారణంతో మంత్రిని కండక్టర్ బస్సు దిగిపోవాలని చెప్పడం చర్చనీయాంశమైంది.
కర్ణాటక: బెంగళూరు నగర బస్సు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ మారువేషంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం రాత్రి ముఖానికి మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిలా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులో ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. చిల్లర లేదనే కారణంతో మంత్రిని కండక్టర్ బస్సు దిగిపోవాలని చెప్పడం చర్చనీయాంశమైంది.
హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లికి వెళ్లే బీఎంటీసీ బస్సులో ఎక్కిన మంత్రి సురేశ్.. రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతూ కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ కోరగా, తన వద్ద లేదని మంత్రి తెలిపారు. అయితే, తన వద్ద కూడా చిల్లర లేదని చెబుతూ బ్యాగ్ చూపించిన కండక్టర్.. చిల్లర లేకపోతే బస్సు దిగిపోవాలని మంత్రికి సూచించారు. మారువేషంలో ఉండటంతో మంత్రిని డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ ఎవరూ గుర్తించలేదు. తన అసలు గుర్తింపును వెల్లడించకుండా మంత్రి నిశ్శబ్దంగా బస్సు దిగిపోయారు. అనంతరం ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు బస్సు డ్రైవర్, కండక్టర్‌ను సస్పెండ్ చేశారు.
తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం 7:10 గంటల నుంచి రాత్రి 9:10 గంటల వరకు మంత్రి సురేశ్ బస్సులో ప్రయాణించారు. జయమహల్, టీవీ టవర్, ఆర్‌టీనగర్, సీబీఐ రోడ్, హెబ్బాల్, మాన్యత టెక్ పార్క్, నాగవారా, హెన్నూరు, హెన్నూరు బండే, బైరతి బండే, గెడ్డలహళ్లి ప్రాంతాల్లో బీఎంటీసీ బస్సుల్లో మంత్రి ప్రయాణిస్తూ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం నాగశెట్టిహళ్లి నుంచి కొంతదూరం ఆటోలోనూ ప్రయాణించారు. మీటర్‌లో రూ.30 చూపించినప్పటికీ డ్రైవర్ రూ.36 డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అదనపు ఛార్జీ ఎందుకని మంత్రి ప్రశ్నించగా.. మీటర్‌లో సమస్య ఉందని, తర్వాత సరిచేస్తానని డ్రైవర్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. చివరకు మంత్రి రూ.40 చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంత్రి ఎక్స్ పోస్టు..
అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న బైరతి సురేశ్.. 'ప్రజా రవాణా సేవల నాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బెంగళూరులో బీఎంటీసీ బస్సుల్లో ఆకస్మికంగా ప్రయాణించాను. ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీతనం కలిగిన ప్రజా రవాణా అందించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత' అని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 19న ఆల్-పార్టీ మీటింగ్
అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళ..