Share News

అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళ..

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:05 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నీళ్లనుకుని యాసిడ్ తాగింది. దీంతో ఆమె నోటిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళ..
Hapur Acid Incident

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నీళ్లనుకుని యాసిడ్ తాగింది. దీంతో ఆమె నోటిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హపూర్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం సాయంత్రం అర్జున్ నగర్ ఏరియాలోని ఓ నగల షాపునకు వెళ్లింది. దాహంగా ఉండటంతో నీళ్లు ఇవ్వమని షాపు‌ యజమానిని అడిగింది. యజమాని చెప్పటంతో షాపులో పని చేసే వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకురావడానికి బయటకు వెళ్లాడు.


కొద్దిసేపటి తర్వాత వాటర్ బాటిల్‌తో తిరిగి వచ్చాడు. బాటిల్‌ను ఆ మహిళకు అందించాడు. మహిళ ఆ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని నోట్లో పోసుకుంది. ఆ వెంటనే చావుకేక పెట్టి.. నోట్లో ఉన్న ద్రవాన్ని బయటకు ఊసింది. గట్టిగా అరవసాగింది. ఆ బాటిల్‌లో ఉన్నది నీళ్లు కాదని, యాసిడ్ అని అప్పుడు తెలిసింది. మహిళ నోటిలో తీవ్రగాయాలు అవ్వటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.


బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ బాటిల్ అమ్మిన షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి షాపు నుంచి మరికొన్ని యాసిడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై నగల షాపు యజమాని దేను మాట్లాడుతూ.. ‘మాకు తెలిసినంత వరకు ఆ బాటిల్ సీల్ చేసి ఉంది. ఫ్రిడ్జ్‌‌ నుంచి బయటకు తీసిన దాన్ని నేరుగా ఆ మహిళకు అందించాము’ అని చెప్పాడు.


ఇవి కూడా చదవండి

ఈ 4 రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త..

పాలక్‌ ఇడ్లీ... తయారు చేసుకోండిలా..

Updated Date - Jul 12 , 2026 | 01:20 PM