Share News

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉధృతం.. నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్..

ABN , Publish Date - Aug 10 , 2026 | 02:48 PM

జార్ఖండ్‌లోని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీక్‌లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్‍సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు, విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు.

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉధృతం.. నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్..
Jharkhand Student Protest

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీక్‌లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్‍సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు, విద్యార్థులు ఇవాళ (సోమవారం) అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధానిలో గందరగోళం నెలకొంది. నిరసనకారులను చెదకొట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ కూడా చేశారు. కాగా, ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వేలాది మంది రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాంచీకి చేరుకున్నారు.


అసెంబ్లీ వైపు కదులుతున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు వాటిని దాటుకుంటూ ముందుకు సాగారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించారు. వాటర్‌ కేనన్లతో నీళ్లు చిమ్ముతుండగా.. కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు, లాఠీఛార్జ్ చేయగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల చర్యలను లెక్కచేయని కొందరు విద్యార్థులు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నియామక పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు, అవకతవకలపై విద్యార్థులు మండిపడుతున్నారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని పట్టుబడుతున్నారు.


విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో స్పష్టమైన పరిష్కారం కనిపించలేదు. దీంతో ఆందోళన 17వ రోజుకు చేరింది. పోలీసులు అడ్డుకున్నా ఘర్షణకు దిగకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల భారీ ప్రదర్శన నేపథ్యంలో రాంచీలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో నగరంలోకి చేరుకోకుండా జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేల వద్ద బస్సులు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేశారు. ముందు జాగ్రత్తగా రాంచీలో చాలా పాఠశాలలను మూసివేశారు.


మరోవైపు.. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా సీఎం హేమంత్‌ సోరెన్‌ నివాసం వెలుపల బీజేపీ నేతలు నిరసనకు దిగారు. నియామక పరీక్షల్లో ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థుల ఆందోళన, పోలీసుల చర్యలతో రాంచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలి: రాహుల్ గాంధీ

ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Updated Date - Aug 10 , 2026 | 03:08 PM