అఖిలపక్ష భేటీలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు లభించిందన్న వార్తలు బూటకం: జైరాం రమేశ్
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:58 PM
ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో మద్దతు లభించిందంటూ వస్తున్న వార్తల్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అబద్ధం, ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు.
ఢిల్లీ, జులై 19: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ (ఆదివారం) కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ రాజకీయ ఉత్కంఠకు, వివాదాలకు దారితీసింది. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో మద్దతు లభించిందంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కమ్యూనికేషన్ల ఇన్‌ఛార్జ్, జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ 'పూర్తిగా అబద్ధం, ఫేక్ న్యూస్' అని ఆయన కొట్టిపారేశారు.
తప్పుడు వార్తలపై జైరాం రమేశ్ ఆగ్రహం
అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు లభించినట్లు కొన్ని టీవీ ఛానెళ్లు ప్రసారం చేస్తున్న వార్తలు కావాలని సృష్టించినవని జైరాం రమేష్ ఆరోపించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ... 'కొన్ని టీవీ ఛానెళ్లు డీలిమిటేషన్ బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో మద్దతు లభించిందంటూ వార్తలను ఫ్లాష్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్' అని ఆయన స్పష్టం చేశారు.
అఖిలపక్ష సమావేశంలో విపక్షాల నిరసన.. వాకౌట్!
రేపటి నుంచి (జులై 20) ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ప్రభుత్వ ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసింది. అయితే, సమావేశం ప్రారంభంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా' (NCPI)ని ఈ సమావేశానికి ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిర్ణయానికి నిరసనగా విపక్షాలన్నీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. అయితే, కొన్ని నిమిషాల నిరసన అనంతరం విపక్ష నేతలు మళ్లీ చర్చల్లో పాల్గొనేందుకు లోపలికి వచ్చారు.
ఈ విషయమై జైరాం రమేశ్ మాట్లాడుతూ... లోక్‌సభ స్పీకర్ వద్ద అనర్హత నిర్ణయం పెండింగ్‌లో ఉన్న 20 మంది తృణమూల్ కాంగ్రెస్ (TMC) 'రెబల్' ఎంపీలకు ఈ NCPI ఒక 'పార్కింగ్ ప్లేస్' లాంటిదని, అలాంటి పార్టీని మోదీ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని నిరసిస్తూనే తాము వాకౌట్ చేశామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండగా.. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల