Share News

ప్రపంచ పటాల్లో పరిమాణాలు సరిదిద్దేందుకు భారత్ మద్దతు

ABN , Publish Date - Sep 06 , 2026 | 02:59 PM

ఆఫ్రికా, ఆసియా ఖండాలను చిన్నవిగా, పాశ్చాత్య దేశాలను పెద్దవిగా చూపే పాత మ్యాప్‌ల పద్ధతిని మార్చడానికి ఐక్యరాజ్యసమితి 'కరెక్ట్ ది మ్యాప్' తీర్మానం తెచ్చింది. భారత్ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చింది.

ప్రపంచ పటాల్లో పరిమాణాలు సరిదిద్దేందుకు భారత్ మద్దతు
J&K, Ladakh Must Follow India’s Official Map: MEA on UNGA Resolution

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 6: ప్రపంచ పటాల్లో ఖండాలు, దేశాల పరిమాణాలు సరిగా లేనందున ఐక్యరాజ్యసమితి 'కరెక్ట్ ది మ్యాప్' తీర్మానం తెచ్చింది. ఆఫ్రికా, ఆసియా ఖండాలను చిన్నవిగా, పాశ్చాత్య దేశాలను పెద్దవిగా చూపే ఈ పాత మ్యాప్‌ల పద్ధతిని మార్చేందుకు భారత్ మద్దతునిచ్చింది. అయితే, భూభాగాల సైజుల మార్పు సాకుతో భారతదేశ సరిహద్దులను (ముఖ్యంగా J&K, లద్దాఖ్) మార్చడానికి వీల్లేదని భారత్ ఖరాఖండిగా చెప్పింది.


సమస్య ఏంటి.. మనం చూసే మ్యాప్‌లు తప్పుగా ఎందుకున్నాయి?

మనం సాధారణంగా పాఠశాలల్లో, గూగుల్ మ్యాప్స్‌లో చూసే ప్రపంచ పటం 16వ శతాబ్దానికి చెందిన 'మెర్కేటర్ ప్రొజెక్షన్' (Mercator projection) ఆధారంగా తయారు చేసింది.

ఈ మ్యాప్‌ను ఆ కాలంలో సముద్ర ప్రయాణాల (నావిగేషన్) కోసం డిజైన్ చేశారు. దీనివల్ల భూమధ్యరేఖ (Equator) దగ్గర ఉండే ఆఫ్రికా, భారతదేశం, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాల (Poles) వైపు ఉండే అమెరికా, యూరప్, రష్యా, గ్రీన్లాండ్ వంటి ప్రాంతాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి.

ఉదాహరణకు.. ప్రస్తుత మ్యాప్‌లలో గ్రీన్లాండ్, ఆఫ్రికా ఖండం ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. కానీ నిజానికి ఆఫ్రికా, గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. అలస్కా, బ్రెజిల్ ఒకే సైజులో ఉన్నట్లు ప్రస్తుత మ్యాప్స్ లలో కనిపిస్తాయి. కానీ బ్రెజిల్, అలస్కా కంటే 5 రెట్లు పెద్దది.

ఐక్యరాజ్యసమితి (UNGA) తీర్మానం ఏంటి?

ఆఫ్రికా దేశాల నేతృత్వంలో 'కరెక్ట్ ది మ్యాప్' (Correct the Map) పేరుతో ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానం పెట్టారు. ఏ దేశం లేదా ఖండం నిజంగా ఎంత విస్తీర్ణం ఉందో, మ్యాప్‌లలో కూడా అదే నిష్పత్తిలో కనిపించేలా (Equal-Area Projection) సాంకేతిక మ్యాప్‌లను ఉపయోగించాలి. ఈ తీర్మానానికి భారత్‌తో సహా 164 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేసింది (6 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు).


భారతదేశం వైఖరి ఏంటి?

1. భారతదేశం ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూనే, ఒక ముఖ్యమైన నిబంధనను స్పష్టం చేసింది. ప్రపంచ పటాల సైజులను సరిదిద్దడం మంచిదే, కానీ జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు కచ్చితంగా భారతదేశ అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలి.

2. సార్వభౌమాధికారం: ఈ తీర్మానం కేవలం భూభాగాల పరిమాణాల వర్ణనకు మాత్రమే పరిమితం. అంతర్జాతీయ సరిహద్దులను లేదా వివాదాస్పద భూభాగాలను నిర్ణయించే హక్కు ఈ తీర్మానానికి లేదు. అంతేకాదు, భారత్ సరిహద్దులను తప్పుగా లేదా తిరిగిరాసి చూపిస్తే ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ తీర్మానాన్ని ఆమోదించడం వెనుక ఉన్న కారణాలను, దాని ప్రధాన పరిధిని వివరించారు. తమ ఓటుతో పాటు భారతదేశం సమర్పించిన అంశాలను స్పష్టం చేస్తూ, సమాన-ప్రాంత సాంకేతిక ప్రాతినిధ్యాలకు మద్దతు ఇవ్వడం జాతీయ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని అధిగమించదని జైస్వాల్ నొక్కిచెప్పారు.


ఇవీ చదవండి:

‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!

మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!

Updated Date - Sep 06 , 2026 | 03:56 PM