Share News

'మేము చమురు అమ్మకుంటే.. ఎవ్వరినీ అమ్మనివ్వం': ఇరాన్

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:16 PM

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ భద్రతకు విఘాతం కలిగిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మౌలిక సదుపాయం సురక్షితంగా ఉండదని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.'మేము చమురు అమ్మలేని పరిస్థితి వస్తే, ఈ ప్రాంతం నుంచి ఎవ్వరినీ చమురు అమ్మనివ్వం' అని తేల్చి చెప్పింది.

'మేము చమురు అమ్మకుంటే.. ఎవ్వరినీ అమ్మనివ్వం': ఇరాన్
Iran’s Ghalibaf Warns US Over Strait of Hormuz, Says No One Will Sell Oil

టెహ్రాన్, సెప్టెంబర్ 29: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ భద్రతకు విఘాతం కలిగిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మౌలిక సదుపాయం కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది, 'మేము చమురు అమ్మలేని పరిస్థితి వస్తే, ఈ ప్రాంతం నుంచి ఎవ్వరినీ కూడా చమురు అమ్మనివ్వం' అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలీబాఫ్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు.


1980 అబాదాన్ ముట్టడితో పోలిక

ఈ సందర్భంగా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కీలకమైన అబాదాన్ ముట్టడిని ఘలీబాఫ్ గుర్తుచేశారు. 'బాథిస్ట్ (సద్దాం హుస్సేన్) దళాలు అబాదాన్ నగరానికి రవాణా మార్గాలను నిలిపివేసి, చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు చేసి నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని చూశాయి. కానీ ఇరాన్ ప్రజలు, విప్లవ పోరాటయోధులు దృఢ సంకల్పంతో కేవలం 48 గంటల్లోనే ఏడాది పొడవునా సాగిన ఆ ముట్టడిని ఛేదించారని వివరించారు.

నేడు కూడా అమెరికా.. ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధం, వైమానిక కారిడార్ల మూసివేత, తీవ్ర ఒత్తిడి ద్వారా ఆర్థిక దిగ్బంధం చేయడానికి ప్రయత్నిస్తోందని, 1980ల నాటి ప్లానింగ్, సైనిక వ్యూహాలతోనే అమెరికా ప్రయత్నాలను కూడా తిప్పికొడతామన్నారు. అమెరికా నుంచి వచ్చే ఏ రకమైన దాడికైనా ఇరాన్ 'సత్వర, కచ్చితమైన, బాధాకరమైన రీతిలో సమాధానం ఇస్తుందని ఘలీబాఫ్ స్పష్టం చేశారు.


ఉద్రిక్తతల మధ్య దౌత్యపరమైన పరిణామాలు

ఒకవైపు ఇరాన్ నుంచి హెచ్చరికలు వస్తుండగా, మరొకవైపు తెరవెనుక దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్ వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. న్యూక్లియర్ అంశంపై ఇరాన్ స్పష్టమైన హామీలు, పురోగతిని చూపిస్తేనే ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదలకు సిద్ధమని ఓ అమెరికా అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు.


ట్రంప్ అసంతృప్తి

హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. 'వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ అది మేము కోరుకునే ఒప్పందం కాదు. వారు పరిస్థితిని మెరుగుపర్చుకోలేదు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


ఇరు దేశాలు అణుకార్యక్రమాలపై కాస్త సడలింపునకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, నిబంధనలు, అమలు చేసే సమయం విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. తాజా సమాచారం ప్రకారం అమెరికా అధికారిక స్పందన కోసం టెహ్రాన్ వేచి చూస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్

హైవోల్టేజ్ డ్రామా.. ఇలాంటి రనౌట్‌ ఎప్పుడూ చూడలేదు!

Updated Date - Sep 29 , 2026 | 03:26 PM