Share News

ఇరాన్‌ చమురుపై ఆంక్షల సడలింపు!

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:46 AM

ఇరాన్‌ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షలు సడలించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. దీంతో ఇరాన్‌ చమురుపై...

ఇరాన్‌ చమురుపై ఆంక్షల సడలింపు!

సముద్రంలో ఉన్న చమురు విక్రయానికి ట్రంప్‌ ఓకే

కొనేందుకు భారత రిఫైనరీల ప్రయత్నాలు

తమ వద్ద చమురు నిల్వలు లేవన్న టెహ్రాన్‌

న్యూఢిల్లీ, మార్చి 21: ఇరాన్‌ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షలు సడలించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. దీంతో ఇరాన్‌ చమురుపై విధించిన ఆంక్షలకు అగ్రరాజ్యం కొంత మేరకు సడలింపు ఇచ్చింది. ప్రస్తుతం సముద్రంలో రవాణాకు సిద్ధంగా ఉన్న చమురును విక్రయించేందుకు ఇరాన్‌కు తాత్కాలికంగా అనుమతి ఇచ్చినట్టు అమెరికా శుక్రవారం ప్రకటించింది. క్రూడాయిల్‌ ధరల నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో ఆసియా వినియోగదారులు, ముఖ్యంగా భారత్‌, జపాన్‌, మలేషియాలకు మేలు జరుగుతుందని పేర్కొంది. దీంతో ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌.. ఇరాన్‌ నుంచి కూడా సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మన దేశంలోని రిఫైనరీలు ఇరాన్‌ చమురు కొనుగోలుకు సిద్ధమయ్యాయి. మూడు కంపెనీలు చమురు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని, ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయని ‘రాయిటర్స్‌’ తన కథనంలో పేర్కొంది. చెల్లింపుల విధానంపై ట్రంప్‌ నుంచి ప్రభుత్వం స్పష్టత కోరినట్టు తెలిపింది. అయితే, ఇరాన్‌ మాత్రం అంతర్జాతీయ కొనుగోలు దారులకు విక్రయించేందుకు తమవద్ద అదనంగా ఎలాంటి చమురు నిల్వలు లేవని ప్రకటించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని సర్దుమణిగేలా చేయడం కోసమే అమెరికా అలా ప్రకటించిందని తెలిపింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్‌ దౌత్యకార్యాలయం పేర్కొంది. దీంతో ఇరాన్‌ చమురుపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్‌కు చెందిన ట్యాంకర్లను ఇరాన్‌ అనుమతించడంతో క్రూడాయిల్‌ సహా ఎల్‌పీజీ తీసుకువస్తున్న మూడు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి.


అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతి

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా నుంచి భారత్‌ వంట గ్యాస్‌(ఎల్‌పీజీ)ను దిగుమతి చేసుకుంది. ఈ నెల 19తో ముగిసిన వారంలో అమెరికా నుంచి 1,76,000 టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకున్నట్టు సీఏఎస్‌ నివేదిక వెల్లడించింది. ఇదే వారంలో పశ్చిమాసియా నుంచి భారత్‌కు ఎలాంటి ఎల్‌పీజీ దిగుమతులు రాలేదని పేర్కొంది. అమెరికాతోపాటు భారత్‌ వివిధ మార్గాల్లో ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటున్నట్టు వివరించింది. ఇక, ఈ ఏడాది అమెరికా నుంచి ఇండియన్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు 22 లక్షల టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలావుంటే, మార్చి 5వ తేదీనాటికి 3,22,000 టన్నులుగా ఉన్న ఎల్‌పీజీ దిగుమతులు.. 19వ తేదీ నాటికి 2,65,000 టన్నులకు తగ్గిపోయినట్టు సీఏఎస్‌ నివేదిక వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 06:46 AM