Share News

ఏప్రిల్‌ 3న నేవీలోకి ‘తారాగిరి’

ABN , Publish Date - Mar 22 , 2026 | 07:04 AM

భారత నౌకా దళంలోకి అత్యాధునిక ‘మిస్సైల్‌ పవర్‌ హౌస్‌’ చేరబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్‌ యుద్ధనౌక ‘తారాగిరి’ ఏప్రిల్‌ 3న అధికారికంగా నౌకా దళంలోకి ప్రవేశిస్తుందని...

ఏప్రిల్‌ 3న నేవీలోకి ‘తారాగిరి’

  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్‌ యుద్ధనౌక

న్యూఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): భారత నౌకా దళంలోకి అత్యాధునిక ‘మిస్సైల్‌ పవర్‌ హౌస్‌’ చేరబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్‌ యుద్ధనౌక ‘తారాగిరి’ ఏప్రిల్‌ 3న అధికారికంగా నౌకా దళంలోకి ప్రవేశిస్తుందని రక్షణరంగ అధికారులు శనివారం తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, రాడార్ల వ్యవస్థతో నిర్మించిన ఈ యుద్ధ నౌక విశాఖపట్నంలో జరిగే కమిషన్‌ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతులు మీదుగా నేవీ అమ్ములపొదిలోకి చేరుతుంది. మన దేశం యుద్ధ నౌకల నిర్మాణం, రూపకల్పనలో స్వయం సమృద్ధి శక్తిగా ఎదుగుతోందని చెప్పడానికి తారాగిరి (ఎఫ్‌41) నిదర్శనం. ఈ నౌక 6,670 టన్నుల బరువు ఉంటుంది. ప్రాజెక్టు 17ఎ క్లాస్‌లో ఇది నాలుగో నౌక. మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డింగ్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మించిన మూడో నౌక. కంబైన్డ్‌ డీజిల్‌ లేదా గ్యాస్‌ (సీవోడీవోజీ) ప్లాంట్‌తో నడిచే తారాగిరి, అధిక వేగం, అత్యధికకాలం ప్రయాణించే శక్తితో బహుముఖ నౌకా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రపంచ స్థాయి ఆయుధాగారం ఈ నౌక సొంతం. ఇందులో సూపర్‌సోనిక్‌ వేగం కలిగిన బ్రహ్మోస్‌ వంటి ఉపరితలం నుంచి ఉపరితలపైకి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణులు (ఎంఆర్‌ఎ్‌సఏఎం), ఒకేసారి పలు లక్ష్యాలను గుర్తించి ట్రాక్‌ చేయగల మల్టీ ఫంక్షన్‌ రాడార్‌, ప్రత్యేకతలతో కూడి శత్రు జలాంతర్గాములపైకి దాడి చేయగల యుద్ధసామగ్రి ఉంటాయి. శత్రు దాడులను సిబ్బంది క్షణాల్లో తిప్పికొట్టేలా కాంబ్యాట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంతో వీటిని అనుసంధానించారు. మునుపటి డిజైన్ల కన్నా ఎంతో ఆధునికంగా రూపొందించిన ఈ యుద్ధనౌక.. శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడగలదు. ఈ నౌకలో 75 శాతంపైగా స్వదేశీ పరికరాల వినియోగంలో 200కు పైగా ఎంఎ్‌సఎమ్‌ఈ సంస్థలు పాలుపంచుకున్నాయని, వేలాది మందికి ఉపాధి లభించిందని అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఆత్మనిర్భరత కార్యక్రమానికి, స్వదేశీ నౌకాశ్రయాల అత్యాధునిక ఇంజనీరింగ్‌ సామర్థ్యాలకు ఇది ప్రతిరూపమని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. సముద్ర జలాల్లో అగ్రశ్రేణి వేటగాడిగానే కాకుండా, ఆధునిక దౌత్యంలోని సంక్లిష్టతలను, మానవీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి తారాగిరిని నిర్మించారని అధికారులు చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 07:04 AM