పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన భారతావని
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:46 AM
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాబైంది. శనివారం పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో వేడుకలకు సర్వం సిద్ధమైంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తామైంది. శనివారం పంద్రాగస్టు నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఎర్రకోట వేదికగా వరుసగా 13వ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే ఈ ఏడాది జరుగుతున్న వేడుకల్లో మరో ప్రత్యేకత సంతరించుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా వందేమాతరం గేయం ఆలాపించనున్నారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. మరో వైపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రత దళాలను మోహరించారు. అందులో భాగంగా వెయ్యి సీసీ టీవీ కెమెరాలతోపాటు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానితులు, నేరగాళ్ల కదలికల దృష్ట్యా భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
ఎర్రకోటలో జరిగే కార్యక్రమానికి వీఐపీలు సహా 25 వేల మంది హాజరవుతారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎర్రకోటకు వచ్చే అన్ని మార్గాలను క్షుణ్ణంగా భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. నేరస్థులను గుర్తించేందుకు అభిజ్ఞాన్ యాప్‌ను దేశ రాజధాని పోలీసులు వినియోగిస్తున్నారు. అభిజ్ఞాన్ యూప్ డేటాబేస్‌లో 1.32 కోట్ల మంది వివరాలను ఇప్పటికే నిక్షిప్తం చేశారు. తనిఖీల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా సిస్టమ్ డేటాబేస్‌కు అనుసంధానం చేశారు. జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల తర్వాత ఢిల్లీలో పోలీసులు భద్రతను మరింత పెంచని విషయం విదితమే.
తెలుగు రాష్ట్రాల్లో..
రెండు రాష్ట్రాల రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. నేడు రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాయపూడిలోని పరేడ్ మైదానంలో ఏర్పాట్లు చేశారు. స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో ఈ వేడుకలను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే రాజధాని రైతులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు.
మరో వైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబయింది. ఈ రోజు ఉదయం 9:55 గంటలకు గోల్కొండ కోటకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ఉదయం10 గంటలకు జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరిస్తారు. ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన వారికి పతకాలను ఆయన అందజేయనున్నారు. రాణి మహల్ వద్దనున్న వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు హాజరు కానున్నారు.
ఎట్ హోమ్ కార్యక్రమం..
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సాయంత్రం లోక్‌భవన్‌లలో ఎట్ హోమ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాల సీఎంలు, మంత్రులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం
For More National News And Telugu News