Share News

Indian Woman Deportation: భారతీయ మహిళను డిపోర్ట్ చేయనున్న పాక్! మతం మారి స్థానికుడిని పెళ్లి చేసుకున్నా..

ABN , Publish Date - Jan 05 , 2026 | 05:33 PM

పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించి స్థానికుడిని వివాహమాడిన ఓ భారతీయ మహిళను అక్కడి అధికారులు త్వరలో భారత్‌కు తిప్పి పంపనున్నారు. అటారీ వాఘా సరిహద్దు వద్ద సోమవారం ఆమెను భారత్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Indian Woman Deportation: భారతీయ మహిళను డిపోర్ట్ చేయనున్న పాక్! మతం మారి స్థానికుడిని పెళ్లి చేసుకున్నా..
Indian Woman in Pak To be deported

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ కోసం పాక్ వెళ్లి స్థానికుడిని వివాహమాడిన ఓ భారతీయ మహిళను పాక్ అధికారులు త్వరలో స్వదేశానికి తిప్పి పంపనున్నారు. అటారీ- వాఘా సరిహద్దు వద్ద ఆమెను సోమవారం భారత్‌కు అప్పగించనున్నారు (Indian Woman To be Deported by Pak).

ఎవరీ భారతీయ వనిత..

పంజాబ్‌కు చెందిన సరబ్‌జీత్ కౌర్ గతేడాది నవంబర్‌లో పాకిస్థాన్‌కు వెళ్లారు. సిక్కు గురువు గురునానక్ దేవ్‌జీ జన్మస్థలమైన నన్కానా సాహిబ్‌ను సందర్శించేందుకు ఓ సిక్కు బృందంతో కలిసి ఆమె వెళ్లారు. అయితే, పాక్‌కు చేరుకున్నాక సరబ్‌జీత్ కనిపించకుండాపోయారు. ఆ తరువాత లాహోర్ సమీపంలోని షేఖ్‌పురా జిల్లాకు చెందిన నసీర్ హుస్సేన్‌‌ను పెళ్లి చేసుకున్నారు. ఇష్టపూర్వకంగానే తాను మతం మారి ఈ వివాహం చేసుకుంటున్నట్టు కూడా తెలిపారు. తన పేరును నూర్ హుస్సేన్‌గా మార్చుకున్నారు. నవంబర్ 5న ఈ వివాహం జరిగినట్టు సమాచారం. పెళ్లి తరువాత ఆ జంట కనిపించకుండా పోవడంతో పోలీసులు కూడా గాలింపు చర్యలు ప్రారంభించారు.


ఈలోపు నవంబర్ 18న ఆ జంట లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లిని రద్దు చేసుకోవాలంటూ తమను పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తాను పాకిస్థానీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, పాక్ పౌరసత్వం తీసుకునేందుకు సిద్ధమైనట్టు భారతీయ దౌత్య కార్యాలయానికి కూడా సమాచారం అందించానని సరబ్‌జీత్ కౌర్ తెలిపారు. తాను డైవర్సీనని కూడా వెల్లడించారు. తనకు నజీర్ 7 ఏళ్లుగా పరిచయమని ఆమె చెప్పినట్టు సమాచారం.

దీంతో, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆ జంటను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, పాక్ అధికారులు మాత్రం ఆమెను భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.


ఇవీ చదవండి:

భారత్‌ నుంచి పెరుగుతున్న శాశ్వత వలసలు.. ఏటా 2 లక్షల మందికి పైగా...

గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు

Updated Date - Jan 05 , 2026 | 05:44 PM