India 4th Largest Economy: ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:34 AM
భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. జపాన్‌ను సైతం వెనక్కు నెట్టిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. 2030 నాటికల్లా 7.0 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి జర్మనీని సైతం అధిగమిస్తుందని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఆంక్షలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు విసిరే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక రంగం దూసుకుపోతోంది. తాజాగా జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతం దేశ జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్రం తాజాగా పేర్కొంది (India 4th Largest Economy).
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, ప్రస్తుతం జపాన్‌ను అధిగమించిన భారత్ మరో మూడున్నర ఏళ్లల్లో జర్మనీని కూడా ఆర్థికంగా ఓవర్ టేక్ చేయనుంది. 2030 నాటికల్లా 7.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. గత పదేళ్లల్లో దాదాపు రెట్టింపైంది. భవిష్యత్తులో కూడా వృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఐఎమ్ఎఫ్ అంచనాల ప్రకారం, వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 4.51 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ మాత్రం 4.46 ట్రిలియన్ డాలర్లుగా ఉండనుంది (India Overtakes Japan).
ఆర్థిక ఎదుగుదలతో పాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండటం విశేషమని ప్రభుత్వం పేర్కొంది. నిరుద్యోగిత తగ్గుతోందని, ఎగుమతులు కూడా క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. రుణ వృద్ధి, వస్తుసేవలకు డిమాండ్ పెరగడం వంటివన్నీ సానుకూల సంకేతాలను తెలిపింది (India's GDP Growth). 2047 నాటి కల్లా (స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్లకు) భారత్ మధ్యాదాయ దేశంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం వెల్లడించింది. నగరాల్లో వినియోగం పెరగడం ఆర్థిక రంగానికి చోదక శక్తిగా ఉందని తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 8.2 శాతం మేర పెరిగింది. అంతకుముందు రెండు త్రైమాసికాల వృద్ధి రేటుతో పోలిస్తే ఇది అధికం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం మేర వృద్ధి చెందగా, గతేడాది చివరి త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నా దేశీయంగా డిమాండ్ బలంగా ఉండటమే ఇందుకు కారణమని కేంద్రం తెలిపింది. పరిశ్రమలు, సేవా రంగాలు మంచి వృద్ధిని కనబరిచాయని వెల్లడించింది (RBI GDP Forecasts). ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది.
దేశీయంగా వస్తుసేవలకు మంచి డిమాండ్ ఉండటం, జీఎస్టీ సంస్కరణలు, తగ్గుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వృద్ధి రేటు అంచనాలను పెంచింది. ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కరణలతో దేశాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కూడా కేంద్రం తెలిపింది.
ఇవీ చదవండి:
కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
పాన్, ఆధార్, క్రెడిట్ స్కోర్ అప్‌డేట్.. 1వ తేదీనుంచి ఏమేం మారనున్నాయంటే..