భారత్‌లో సగానికి పైగా కార్లు, బైకులకు బీమా లేదు: కేంద్రం
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:25 PM
భారత్‌లో సగానికి పైగా కార్లు, బైకులకు ఇన్సూరెన్స్ లేదని కేంద్రం తాజాగా వెల్లడించింది. రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో సుమారు 50 శాతం కార్లు, బైక్‌లకు ఇన్సూరెన్స్ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు 44 శాతం వాహనాలు చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయని పేర్కొంది. రాజ్యసభలో బీమా లేని ప్రమాద పరిహారంపై కేఆర్.సురేశ్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. మార్చి 6 నాటికి వాహన్ డేటాబేస్‌లో పొందుపరిచిన యాక్టివ్ వాహనాల జాబితా ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనేక సూచనలిచ్చింది. ఈ సంఖ్యను మెరుగుపరచేందుకు కఠినమైన నియమాలను అవలంబించడం సహా ప్రజావగాహన చర్యలు చేపట్టాలని కోరింది. అంతేకాకుండా.. మెరుగైన సౌకర్యాల కోసం డిజిటల్ ధ్రువీకరణ లాంటి సాంకేతిక సాధనాలను స్వీకరించాలంది. అయితే దీని అమలుకు ప్రాథమిక బాధ్యత రాష్ట్ర అధికారులపైనే ఉంటుంది.
మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 146 కింద తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలను నడిపితే మొదటిసారి రూ.2,000; ఆపై రూ.4,000 జరిమానా లేదా 3 నెలల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. పైగా బీమాలేని వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి థర్డ్ పార్టీ కవరేజ్ వర్తించదు.
బీమా లేకపోతే పరిణామాలివే..
చట్టపరమైన చర్యలు: ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తారు. అవసరమైతే వాహనాన్ని సీజ్ చేసే అవకాశముంది.
ఆర్థిక నష్టం: ప్రమాదం జరిగితే వాహన యజమాని సొంతంగా బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
పాలిసీ రెన్యూవల్: బీమా గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకోవడం కష్టం. కాబట్టి నిర్దిష్ట గడువులోపే రెన్యూవల్ చేసుకోవాలి.
భవిష్యత్తులో బీమా లేని వాహనాలపై జరిమానాలు పెంచాలని, మొదటిసారి దొరికితే ప్రీమియంకు 3 రెట్లు, రెండోసారి 5 రెట్లు వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
ఆ పరీక్షా షెడ్యూల్‌పై సీబీఎస్ఈ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్ అని స్పష్టం
AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ