భారత్తో కీలక అంశాల్లో అసాధారణ ఏకాభిప్రాయం: అమెరికా విదేశాంగ మంత్రి
ABN , Publish Date - Oct 21 , 2026 | 09:34 AM
భారత్, అమెరికా మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ.. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కీలక విషయాల్లో అసాధారణ ఏకాభిప్రాయం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, అమెరికా మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ.. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కీలక విషయాల్లో అసాధారణ ఏకాభిప్రాయం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రపంచ రాజకీయాలు, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం 21వ శతాబ్దపు ప్రపంచ గతిని ప్రభావితం చేయగలదని పేర్కొన్నారు. ముంబైలో మంగళవారం నిర్వహించిన 'ఫ్రీడమ్ 250' కార్యక్రమంలో పాల్గొన్న రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు (India US Relations).
భారత్ వంటి భారీ దేశంతో అమెరికాకు ఉన్న సంబంధాలు ఎంతో కీలకమని, కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నంత మాత్రాన మొత్తం భాగస్వామ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని రూబియో అభిప్రాయపడ్డారు. భారత్ శక్తిమంతమైన, ప్రభావవంతమైన, అభివృద్ధి చెందిన దేశమని రూబియో ప్రశంసించారు. అమెరికాకు భారత్ బలమైన భౌగోళిక రాజకీయ భాగస్వామి అని పేర్కొన్నారు. వ్యక్తిగత గౌరవం, ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధ పాలన వంటి అంశాల్లో రెండు దేశాలకు ఉమ్మడి విలువలు ఉన్నాయని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారుకు ఇరు దేశాలు దగ్గరగా ఉన్నాయని రూబియో తెలిపారు. పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు (Marco Rubio India Visit).
ఏ రెండు దేశాలూ ప్రతి అంశంలోనూ ఒకే అభిప్రాయంతో ఉండలేవని రూబియో అంగీకరించారు (India US Strategic Partnership). అయితే, జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో భారత్, అమెరికా మధ్య ఉన్న సారూప్యతే తమ సంబంధాలకు బలమని స్పష్టం చేశారు. కాగా, ప్రపంచ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం కీలకమని ఇరు దేశాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై జరిగే చర్చలు భారత్-అమెరికా సంబంధాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..