Share News

లగ్జరీ కార్లు.. ఇక చీప్‌!

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:16 AM

బ్రిటన్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనకు మరింత చౌక ధరలకే లభించనున్నాయి. లగ్జరీ కార్ల నుంచి స్కాచ్‌ విస్కీ వరకు, వైద్య పరికరాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు...

లగ్జరీ కార్లు.. ఇక చీప్‌!

  • సబ్బులు, చాక్లెట్లు, బిస్కట్లు

  • సౌందర్య సాధనాలు, మాంసం, వైద్య పరికరాలు, స్కాచ్‌ విస్కీ సహా మరింత చౌకగా బ్రిటన్‌ ఉత్పత్తులు

  • లండన్‌ మార్కెట్‌కు పోటెత్తనున్న భారత దుస్తులు, ఇతర వస్తువులు

  • అమల్లోకి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం

  • సాగు ఉత్పత్తులకు మినహాయింపు

  • మన దేశం నుంచి 99% వస్తువులపై సుంకాలను రద్దు చేసిన కింగ్‌డమ్‌

  • వాణిజ్యానికి భారీ ప్రోత్సాహం:మోదీ

న్యూఢిల్లీ, జూలై 15: బ్రిటన్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనకు మరింత చౌక ధరలకే లభించనున్నాయి. లగ్జరీ కార్ల నుంచి స్కాచ్‌ విస్కీ వరకు, వైద్య పరికరాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్ని ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే, మన దేశ దుస్తులు, ఇతర ఉత్పత్తులు బ్రిటన్‌ మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దీనికి కారణం.. భారత్‌-బ్రిటన్‌ దేశాల మధ్య 2025, జూలై 25న కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) బుధవారం నుంచి అమల్లోకి రావడమే!. ఈ ఒప్పందం కింద భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు బ్రిటన్‌, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు భారత్‌ సుంకాలను భారీ స్థాయిలో తగ్గించాయి. ముఖ్యంగా భారత దేశం నుంచి ఎగుమతయ్యే 99% వస్తువులపై సుంకాలను బ్రిటన్‌ రద్దు చేసింది. ఫలితంగా బ్రిటన్‌ వస్తువులు మన దేశంలో కారు చౌకకే లభించనుండగా, మన దేశంలో తయారయ్యే వస్తువులకు లండన్‌ మార్కెట్‌ మరింత విస్తృతం కానుంది. గత ఏడాది జూలై 25న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు గోయెల్‌, జోనథన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో బ్రిటన్‌ నుంచి దిగుమతి చేసుకునే చాక్లెట్లు, బిస్కట్లు, శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, షేవింగ్‌ క్రీములు, గోళ్ల రంగుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే, ఎంపిక చేసిన ఆహారం, గొర్రె మాంసం, చేపల ధరలను దశల వారీగా తగ్గించనున్నారు. అదేవిధంగా వైద్య పరికరాల ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. వీటిలో సర్జికల్‌ వస్తువులు, వ్యాధి నిర్ధారణ పరికరాలు, ఈసీజీ మిషన్లు, ఎక్స్‌-రే వ్యవస్థ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం వైద్య పరికరాలపై బ్రిటన్‌ సుంకాలు 7-15ు వరకు ఉండగా.. ప్రస్తుత ఒప్పందంతో ఇవి 3శాతానికి దిగిరానున్నాయి. అలాగే, బ్రిటన్‌ నుంచి దిగుమతి చేసుకునే వెండి వస్తువులపై రానున్న పదేళ్లలో సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు. అలాగే, లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్‌ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.


మద్యం ప్రియులకు పండగే

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. మద్యం ప్రియులకు పండగ తీసుకురానుంది. స్కాచ్‌ విస్కీ, జిన్‌ వంటి బ్రిటన్‌ మద్యం ధరలు తక్షణమే 150ు నుంచి 75 శాతానికి తగ్గిపోనున్నాయి. వచ్చే పదేళ్లలో ఈ ధరలు సైతం 40 శాతానికి తగ్గుముఖం పడతాయి. ఇక, మరో ఏడాది కాలంలో సైడెర్‌, బ్రాందీ, బార్బన్‌, రమ్‌, ఓడ్కా, ఇతర లిక్కర్లపై కూడా సుంకాలు 150 నుంచి 110 శాతానికి తగ్గనున్నాయి. రానున్న పదేళ్లలో 75 శాతానికి తగ్గించనున్నారు.

రోల్స్‌ రాయిస్‌ 1-3 కోట్లే!

బ్రిటన్‌ నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు, మోటారు సైకిళ్లు ధరలు తక్షణమే తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రస్తుతం వీటిపై 110ు మేరకు దిగుమతి సుంకం ఉండగా.. తక్షణం 30 శాతానికి, వచ్చే పదేళ్లలో 10 శాతానికి దీనిని తగ్గించనున్నారు. ఒప్పందం ప్రకారం.. పెట్రోలు, డీజిల్‌ కార్లపై రాయితీలు తక్షణమే అమల్లోకి రాగా, ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌, హైడ్రోజన్‌ వాహనాలపై ఆరేళ్ల తర్వాత తగ్గింపు వర్తిస్తుంది. భారత్‌లో దేశీయ విద్యుత్‌ వాహనాల తయారీ రంగాన్ని పరిరక్షించే క్రమంలో ఈ మేరకు గడువు విధించారు. లగ్జరీ కార్ల విషయానికి వస్తే రోల్స్‌ రాయిస్‌, ఆస్టాన్‌ మార్టిన్‌, మెక్‌ లారెన్‌, జాగర్‌, లాండ్‌ రోవర్‌ వంటి కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. తక్షణమే వీటి ధరలు 20-25 శాతం మేరకు తగ్గడంతో రోల్స్‌ రాయిస్‌ రూ.1-3 కోట్ల ధరలకే లభించనుంది.

మనకెంతో మేలు: ప్రధాని

భారత్‌-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశంలోని కోట్లాది మంది రైతులు, వ్యాపారవేత్తలు, ఎం.ఎ్‌స.ఎం.ఈలకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశ వస్తువులకు బ్రిటన్‌ మార్కెట్‌ మరింత చేరువ కానుందన్నారు.భారత్‌-బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం హర్షణీయమని బ్రిటన్‌ హైకమిషనర్‌ లిండీ కామెరాన్‌ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:16 AM