Share News

న్యూజిలాండ్, సింగపూర్‌లతో భారత రక్షణ బంధం మరింత బలోపేతం

ABN , Publish Date - May 31 , 2026 | 03:18 PM

సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్, న్యూజిలాండ్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

న్యూజిలాండ్, సింగపూర్‌లతో భారత రక్షణ బంధం మరింత బలోపేతం
India Strengthens Defence Ties with Singapore and New Zealand

న్యూఢిల్లీ/సింగపూర్, మే 31: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యూహాలకు పదును పెడుతోంది. సింగపూర్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా భద్రతా సదస్సు 'షాంగ్రి-లా డైలాగ్' (Shangri-La Dialogue) వేదికగా భారత్.. న్యూజిలాండ్, సింగపూర్ దేశాలతో తన రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. ఆయా దేశాల రక్షణ శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు.


న్యూజిలాండ్‌తో రక్షణ సహకారం

భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.... న్యూజిలాండ్ రక్షణ మంత్రి క్రిస్ పెన్క్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఇరుపక్షాలు మొగ్గు చూపాయి. ప్రత్యేకించి.. సముద్ర భద్రత, సమాచార మార్పిడి, ఉమ్మడి సైనిక విన్యాసాల నిర్వహణపై ఇరు దేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ బంధం ఎంతగానో దోహదపడుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.


సింగపూర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం

న్యూజిలాండ్‌తో చర్చల అనంతరం, రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్ రక్షణ మంత్రి చాన్ చుంగ్ సింగ్‌తో సమావేశమయ్యారు. రక్షణ సాంకేతికత, రక్షణ పరిశ్రమల సహకారం, సముద్ర భద్రత, సమాచార మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, ఉమ్మడి శిక్షణ, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శాంతిభద్రతలపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. 'షాంగ్రి-లా డైలాగ్' వేదికగా జరిగిన ఈ ద్వైపాక్షిక చర్చలు పరస్పర నమ్మకాన్ని పెంచడమే కాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేశాయి.


ఇవి కూడా చదవండి..

భారత అథ్లెటిక్స్‌కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్‌'లో ప్రధాని ప్రశంసలు

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘటన.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి..

Updated Date - May 31 , 2026 | 04:32 PM