రూ.1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:25 AM
ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఏఐ), మొబైల్ ఫోన్ల సాంకేతికతలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ టెక్నాలజీలకుగుండెకాయలాంటి సెమీకండక్టర్ల ఉత్పత్తిలో భారత్‌ను గ్లోబల్ సెంటర్‌గా...
రూ.62,500 కోట్లతో మొబైల్ ఫోన్ల తయారీ పథకం
సెమీకండక్టర్, మొబైల్ ఫోన్ పరిశ్రమల అభివృద్ధికి
కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు
మొత్తం రూ.1.9 లక్షల కోట్ల పథకాలకు క్యాబినెట్ ఓకే
మరో కోటి టన్నుల యూరియా ఉత్పత్తికి ‘నిపు-2026’
క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, జూలై 15: ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఏఐ), మొబైల్ ఫోన్ల సాంకేతికతలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ టెక్నాలజీలకుగుండెకాయలాంటి సెమీకండక్టర్ల ఉత్పత్తిలో భారత్‌ను గ్లోబల్ సెంటర్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమతోపాటు మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ.1.9 లక్షల కోట్లతో ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. రూ.1.27 లక్షల కోట్లతో చేపట్టనున్న సెమికాన్ 2.0తోపాటు రూ.62,500 కోట్లతో చేపట్టనున్న మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంఎస్) పథకాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటితోపాటు దేశీయంగా మరో కోటి టన్నుల యూరియా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు నేషనల్ ఇన్వె్‌స్టమెంట్ పాలసీ ఫర్ యూరియా(నిపు-2026) పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ పథకాలు కొనసాగుతాయి. సెమికాన్ 2.0 కాలం పూర్తయ్యేనాటికి చిప్‌ల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశీయంగా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతంలోనే ‘సెమీకండక్టర్ మిషన్’ను ప్రారంభించింది. రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో 12 కంపెనీల స్థాపనకు అనుమతి ఇచ్చింది. వీటిలో ఒక సిలికాన్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు, ఒక సిలికాన్ కార్బైడ్ కంపెనీ, ఒక ఇంటిగ్రేటెడ్ గాలియం నైట్రైడ్ మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్లాంటుతోపాటు 9 ప్యాకేజింగ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో మైక్రాన్, కేన్స్, సీజీ సెమీ సంస్థలు చిప్‌ల ఉత్పత్తిని ప్రారంభించాయి. చిప్‌ల ఉత్పత్తిలో అత్యంత కీలకమైన సిలికాన్ ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తి 2028 నాటికి ప్రారంభమవుతుంది. తాజా సెమికాన్ 2.0లో భాగంగా ఈ రంగంలో మరిన్ని కంపెనీలు తమ యూనిట్లను దేశంలో స్థాపించేలా ప్రోత్సహించటం ద్వారా కనీసం రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యేనాటికి రూ.2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న మనదేశంలో ఇప్పటికీ చైనా, అమెరికా, దక్షిణ కొరియా కంపెనీలు ఉత్పత్తి చేసిన ఫోన్లనే అత్యధికంగా వాడుతున్నారు. దేశంలో వాడుతున్న ఫోన్లలో 99.2ు దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. వీటిలో భారత్‌కు సొంతమైన మొబైల్ బ్రాండ్లు చాలా తక్కువ. దీంతో భారతీయ బ్రాండ్లను ప్రోత్సహించటంతో పాటు మొబైల్ ఫోన్ల ఎగుమతిలో ప్రపంచ నంబర్ వన్‌గా ఎదగాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.62,500 కోట్లతో ఎంపీఎంఎస్ పథకాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం పూర్తయ్యే నాటికి దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకంలో భాగంగా కొన్ని మొబైల్ ఫోన్ల అమ్మకాలపై 2.25ు నుంచి 5ు వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. దేశీయంగా మొబైల్ విడిభాగాల ఉత్పత్తికి 1.5ు ఇన్‌సెంటివ్స్ ఇస్తారు. మొబైల్ ఫోన్ల డిజైన్, రిసెర్చ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలకు 3ు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఎంపీఎంఎస్ ద్వారా రూ.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతోపాటు దేశీయంగా మొబైల్ ఫోన్ల పరిశ్రమలో కొత్తగా 60 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
యూరియాలో స్వయం సమృద్ధి
దేశీయంగా ప్రస్తుతం ఏటా దాదాపు 3 కోట్ల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా, డిమాండ్ 4 కోట్ల టన్నుల వరకు ఉంది. దీంతో కోటి టన్నుల యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ కోటి టన్నుల యూరియాను కూడా దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ‘నిపు-2026’కు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 8-9 గ్యాస్ ఆధారిత కొత్త యూరియా కంపెనీల స్థాపనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశంలో యూరియా డిమాండ్ ఏటా 5ు వరకు పెరుగుతోందని, అయినా ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News