Share News

ఆసియా తృతీయశక్తి భారత్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:41 AM

ఆసియాలో మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్‌ తన స్థానాన్ని మరోమారు నిలుపుకొంది.

ఆసియా తృతీయశక్తి భారత్‌
index

  • ఆసియా-పసిఫిక్‌లో అత్యంత శక్తిమంతమైన మూడో దేశం

  • తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా

  • ప్రభావవంతమైన నేతల్లో ద్వితీయస్థానంలో మోదీ

  • లోవీ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఆసియా పవర్‌ ఇండెక్స్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆసియాలో మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్‌ తన స్థానాన్ని మరోమారు నిలుపుకొంది. ప్రధాని మోదీ ఆసియాలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో రెండోస్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్‌ అనే థింక్‌ట్యాంక్‌ సోమవారం విడుదల చేసిన ‘ఆసియా పవర్‌ ఇండెక్స్‌-2026’ ఈ ర్యాంకులను వెల్లడించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రభావం చూపుతున్న 27 దేశాలను 131 సూచీల ఆధారంగా బేరీజు వేసి ఈ ర్యాంకులు ఇచ్చారు. ఆమెరికా, చైనా దేశాలు సూపర్‌ పవర్స్‌గా మొదటి, రెండవ స్థానాలలో కొనసాగుతుండగా.. మూడో స్థానంలో భారత్‌, నాలుగు, ఐదవ స్థానాలలో వరుసగా జపాన్‌, రష్యా నిలిచాయి. భారత్‌ గత మూడేళ్లుగా 3వ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. దౌత్యపరంగా భారత్‌ గట్టి ప్రభావం చూపుతోందని, బలమైన రక్షణ సంబంధాలను కొనసాగిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది.


modi copy.jpgఆర్థిక, సాంస్కృతిక సంబంధాల విషయంలోనూ పురోగతిని సాధించిందని తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించటంలో అమెరికా తర్వాత రెండోస్థానంలో భారత్‌ నిలిచింది. ఈ అంశంలో చైనా 3వ స్థానంలో ఉండటం గమనార్హం. ఇక మిలిటరీ, పారామిలిటరీ సంఖ్య, వాటికి అందించే శిక్షణ, వాటి సంసిద్ధత, క్షేత్రస్థాయి పనితీరులో భారత్‌ 100 శాతం పాయింట్లను సాధించటం విశేషం. ఈ అంశంలో 85.3 పాయింట్లలో రెండోస్థానంలో చైనా, 64.8 పాయింట్లతో మూడోస్థానంలో అమెరికా నిలిచాయి. అయితే, సైనిక సామర్థ్యాన్ని మదింపు వేసే పలు అంశాల్లో ఇది ఒకటి మాత్రమే. మొత్తంగా సైనిక సామర్థ్యంలో భారత్‌ 4వ ర్యాంకు సాధించింది. భారత్‌లో 2050 నాటికి పనులు చేయదగిన వయసులో ఉన్న వారి సంఖ్య (శ్రామిక జనాభా) 113 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక తెలిపింది.మరోవైపు, ఈ ఏడాది ‘ఆసియా పవర్‌ ఇండెక్స్‌’లోని సమర్థవంతమైన నాయకుల జాబితాలో ప్రధాని మోదీ.. చైనా అధినేత జిన్‌పింగ్‌ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే మోదీ మూడు స్థానాలు పైకి ఎగబాకారు. ఆసియాలో భారత దౌత్యప్రయోజనాలను మోదీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఈ నివేదిక తెలిపింది. అయితే, అంతర్జాతీయ నాయకత్వం విషయంలో మోదీ మీద ఉన్న అంచనాలు తగ్గాయని, ఇటీవలి అమెరికా-ఇరాన్‌ యుద్ధం సందర్భంగా భారత్‌ పెద్దగా చొరవ చూపకపోవటం, విశాఖపట్నం నుంచి తిరిగి స్వదేశానికి వెళ్తున్న ఇరాన్‌ యుద్ధనౌకను అమెరికా దాడి చేసి ముంచేసినా ఖండించకపోవటం వంటి ఉదంతాలు దీనికి కారణమని విశ్లేషించింది. మరోవైపు, అమెరికా (78.9), చైనా (73.6) మధ్య అంతరం గత ఎనిమిదేళ్లలో అత్యల్ప స్థాయికి (5.3 పాయింట్లకు) చేరుకుందని ఈ నివేదిక తెలిపింది. సైనిక సామర్థ్యంలోనూ చైనా దాదాపుగా అమెరికా స్థాయికి వచ్చేసిందని పేర్కొంది

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 04:11 AM