ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్.. 13 శాతం లోటు వర్షపాతం..
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:01 PM
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, సాధారణంగా 868.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఈసారి సుమారు 759.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే సాధారణ వర్షపాతంతో పోలిస్తే 12.6 శాతం లోటు నమోదైంది (India monsoon 2026).
గత దశాబ్ద కాలంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదైన సీజన్ ఇదే. ఇక, 2001 తర్వాత నమోదైన తక్కువ వర్షపాతం ఉన్న రుతుపవన సీజన్లలో ఇది నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్‌నినో పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపించాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ఏర్పడే ఎల్‌నినో సాధారణంగా భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈసారి వర్షపాతం తగ్గడానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు (Monsoon rainfall deficit).
2026 రుతుపవనాల సీజన్‌లో నెలల వారీగా కూడా వర్షపాతంలో భారీ తేడాలు కనిపించాయి (13 percent rainfall deficit). జూన్‌లో 35 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఆగస్టులో 16.3 శాతం, సెప్టెంబర్‌లో 7.6 శాతం లోటు నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి. జూలైలో మాత్రం 1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే దేశవ్యాప్తంగా వర్షపాతం ఒకే విధంగా నమోదు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాలు తీవ్ర లోటును ఎదుర్కొన్నాయి. కాగా, ఒడిశాలో సెప్టెంబర్ 28 నాటికి సాధారణం కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
ఇవి కూడా చదవండి..
అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..
రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..