Share News

రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:48 PM

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లై దుబాయ్‌' విమానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం అత్యవసర సంకేతాలను పంపడంతో దాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయానికి మళ్లించారు.

రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
Dubai Tel Aviv flight

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లై దుబాయ్‌' విమానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం అత్యవసర సంకేతాలను పంపడంతో దాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయానికి మళ్లించారు. తొలుత విమానం హైజాక్‌కు గురైందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే హైజాకింగ్‌ జరగలేదని ఆ తర్వాత ఇజ్రాయెల్‌ అధికారులు స్పష్టం చేశారు. విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన శారీరక ఘర్షణే ఘటనకు కారణమని అధికారులు తెలిపారు (Dubai Tel Aviv flight).


'ఫ్లై దుబాయ్‌' విమానం ఎఫ్‌జెడ్‌1073 దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ సమయంలోనే విమానం నుంచి అత్యవసర సంకేతాలు పంపినట్లు సమాచారం. విమాన ట్రాకింగ్‌ సమాచారం ప్రకారం మొదట సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం వచ్చింది. ఆ తర్వాత అక్రమ జోక్యం లేదా హైజాకింగ్‌ అనుమానాన్ని సూచించే సంకేతం వెలువడింది. దీంతో ఇజ్రాయెల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు (Pilots fight).


ట్రాకింగ్‌ డేటా ప్రకారం, విమానం సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా కేవలం రెండే నిమిషాల్లో దాదాపు 17 వేల అడుగుల కిందకు దిగింది. ఆ తర్వాత దాని ప్రయాణ మార్గంలో కూడా మార్పులు కనిపించాయి. ఈ పరిణామాలతో విమానంలో పరిస్థితి సాధారణంగా లేదన్న విషయం స్పష్టమైంది. చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయం వైపు మళ్లించారు. ఇంత గందరగోళానికి కారణమైన పైలట్ల మధ్య గొడవ ఎందుకు జరిగిందన్నది స్పష్టంగా తెలియలేదు (Saudi Arabia emergency landing).


విమానం ముందు భాగం నుంచి అరుపులు వినిపించాయని కొందరు ప్రయాణికులు చెప్పారు (Hijack alert). పైలట్లు ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకున్నారని కూడా ప్రయాణికులు వెల్లడించారు. విమానం చివరకు వాయువ్య సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని 'ఫ్లై దుబాయ్‌' ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

Updated Date - Sep 30 , 2026 | 02:48 PM