సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన అస్త్రం.. ఈ వారంలోనే విపక్షాలు నోటీసు
ABN , Publish Date - Mar 09 , 2026 | 09:19 PM
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో లెక్కకు మిక్కిలిగా ఓటర్లను తొలగిస్తున్నారని, అధికార పక్షానికి అనూకూలంగా వ్యవహారిస్తూ, పారదర్శకతను పాతరేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై విరుచుకుపడుతున్న విపక్షాలు తాజాగా ఆయనపై అభిశంసన అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో లెక్కకు మిక్కిలిగా ఓటర్లను తొలగిస్తున్నారని, అధికార పక్షానికి అనూకూలంగా వ్యవహారిస్తూ, పారదర్శకతకు పాతరేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)పై విరుచుకుపడుతున్న విపక్షాలు తాజాగా ఆయనపై అభిశంసన అస్త్రం (Impeachment notice) ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన నోటీసు ముసాయిదాను 'ఇండియా' కూటమి నేతలు తయారు చేశారని, రాబోయే రెండు మూడు రోజుల్లో లోక్‌సభ స్పీకర్‌కు కానీ, రాజ్యసభ చైర్మన్‌కు కానీ సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివాదాస్పద ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం పెద్దఎత్తున ఓటర్లను తొలగించారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈనెల 6వ తేదీ నుంచి కోల్‌కతాలో నిరసన సాగిస్తున్నారు. ఎస్ఐఆర్‌తో ఓటర్లను పెద్దఎత్తున తొలగించడంపై చర్చ జరపాలంటూ టీఎంసీ ఎంపీలు ఇప్పటికే పార్లమెంటు ఉభయసభల్లోనూ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సీఈసీపై అభిశంసన తీర్మానం అంశాన్ని 'ఇండియా' కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో టీఎంసీ లోక్‌సభ డిప్యూటీ నేత శతాబ్ది రాయ్ ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు. మమతా బెనర్జీ నిరసనను ఈ సందర్భంగా శతాబ్ది రాయ్ ప్రస్తావిస్తూ సీఈసీపై విపక్షాలు తదుపరి చర్య చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే మద్దతిస్తామని ఇటీవల ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ కూడా స్పష్టం చేశారు.
సీఈసీని అభిశంసించాలంటే...
కాగా, సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఉభయసభల్లో ఎక్కడైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సీఈసీ అభిశంసన విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల అభిశంసనకు అనుసరించే పద్ధతినే పాటిస్తారు. అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ కానీ తొలుత పరిశీలిస్తారు. ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆరోపణలను నిజమని కమిటీ నిర్ధారిస్తే అభిశంసన తీర్మానంపై ఉభయ సభల్లో ఓటింగ్ జరుపుతారు. ఓటింగ్‌కు హాజరయ్యే ఎంపీలలో మూడింట రెండు వంతుల మంది తీర్మానాన్ని బలపరచాలి. తీర్మానం ఆమోదం పొందితే సీఈసీని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఇవి కూడా చదవండి..
సీఈసీ గోబ్యాక్ నినాదాలు, నల్లజెండాలతో నిరసనలు
కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు