Share News

రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తెచ్చే కుట్ర: ఖర్గే

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:18 AM

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశంలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు పొంచి ఉందని ప్రతిపక్ష ఇండి కూటమి ఆందోళన వ్యక్తంచేసింది.

రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తెచ్చే కుట్ర: ఖర్గే
rahulandkharge

  • ప్రజాస్వామ్యానికి పెనుముప్పు

  • బీజేపీ తన అధికారం శాశ్వతం చేసుకొనేందుకే ఈ బిల్లు

  • రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తెచ్చేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌ కుట్ర

  • మీడియా సమావేశంలో ఖర్గే

  • ఇండి కూటమి నేతల భేటీ.. ఆప్‌, ఎన్‌సీపీ, బీజేడీ, డీఎంకే దూరం

న్యూఢిల్లీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశంలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు పొంచి ఉందని ప్రతిపక్ష ఇండి కూటమి ఆందోళన వ్యక్తంచేసింది. ఈ బిల్లును పార్లమెంటులో ముక్త కంఠంతో వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఆరెస్సెస్‌, బీజేపీ శాశ్వతంగా అధికారాన్ని కైవసం చేసుకునేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నారని విపక్ష కూటమి నేతలు ఆరోపించారు. లోక్‌సభలో ప్రస్తుత సీట్ల సంఖ్యనే కొనసాగిస్తూ 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, వచ్చే 25 ఏళ్లపాటు రాష్ట్రాలవారీగా పార్లమెంటు స్థానాల కేటాయింపులో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం నుంచిపార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతలు శనివారం సమావేశమై డీలిమిటేషన్‌ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో ఖర్గేతోపాటు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, సీపీఎం, ఆర్‌ఎ్‌సపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ పార్టీల ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ పాల్గొన్నారు. శివసేన(యూబీటీ), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, జేఎంఎం, సీపీఐ నేతలు వర్చువల్‌గా హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో వీసీకే అధ్యక్షుడు తోల్‌ తిరుమావళన్‌ హాజరు కాలేకపోయారు. ఎన్‌సీపీ (ఎస్‌పీ), డీఎంకే, ఆప్‌, బీజేడీ పార్టీలు ఈ భేటీకి దూరంగా ఉన్నాయి.


అధికారాన్ని శాశ్వతం చేసుకొనే కుట్ర: ఖర్గే

దేశంలో తన అధికారాన్ని శాశ్వతం చేసుకొనేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌ కుట్ర చేస్తున్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కూటమి భేటీ అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చివేసి, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి.. అధికారంపై తమ పట్టును శాశ్వతం చేసుకోవడానికి బీజేపీ సర్కారు డీలిమిటేషన్‌కు పూనుకుందని ఆరోపించారు. డీలిమిటేషన్‌ జరిగితే రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయడం ఖాయమని అన్నారు. డీలిమిటేషన్‌ బిల్లును ఇండి కూటమి పక్షాలన్నీ కలిసికట్టుగా అడ్డుకుంటాయని తెలిపారు. డీలిమిటేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ వర్గాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. 2026 జనగణన వివరాలు వచ్చేవరకు ఆగకుండా పాత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కొత్త జనగణన ప్రకారం సీట్లు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని స్థానాలు దక్కుతాయని, ఆ వాటాను వారికి దక్కకుండా చేసందుకే మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘానికి (ఈసీ) ఇప్పుడు డీలిమిటేషన్‌ బాధ్యతలు అప్పగించడం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఖర్గే తేల్చిచెప్పారు. సీఈసీ జ్ఞానే్‌షకుమార్‌ వైఖరిపై ఇప్పటికే సందేహాలు ఉన్నాయని అన్నారు. ఏ సీటును జనరల్‌గా ఉంచాలి? దేనిని రిజర్వ్‌ చేయాలి? మహిళలకు ఎక్కడ కేటాయించాలి? వంటి కీలక నిర్ణయాల్లో ఈసీ పాత్ర ఉంటుందని.. ఓట్ల చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పర్యవేక్షణలో డీలిమిటేషన్‌ జరిగితే నిష్పాక్షికతకు గ్యారెంటీ ఏముంటుందని నిలదీశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

Updated Date - Nov 29 , 2026 | 05:19 AM