Share News

సుంకాలకు జంకం..ఆత్మనిర్భర శంఖం

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:29 AM

జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు దీటుగా బడ్జెట్‌లో ‘స్వదేశీ మంత్రం’ పఠించారు! సుంకాలకు జంకేది లేదంటూ ఆత్మ నిర్భర అస్త్రానికి పదును పెట్టారు! ట్రంప్‌ సుంకాలతో దెబ్బతిన్న రంగాలకు ‘కస్టమ్స్‌’ తగ్గించారు! నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ‘బూస్ట్‌’ ఇచ్చారు....

సుంకాలకు జంకం..ఆత్మనిర్భర శంఖం

  • ట్రంప్‌ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత

  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ సహా ఐదు రాష్ట్రాలకు ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి! మామూలుగా అయితే బడ్జెట్లో వాటికి తాయిలాలు ప్రకటిస్తారు! పథకాలు, నిధులు పారిస్తారు! కానీ, ఎన్నికల్లో గెలుపునకు ‘వేరే వ్యూహాలు’ ఉండడంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి రాజకీయ లబ్ధికి చోటివ్వలేదు!

  • గత ఏడాదే వ్యక్తిగత ఆదాయ పన్నును భారీగా సరళీకరించారు. ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించారు. ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. వీటితో ట్రంప్‌ సుంకాలను దీటుగా ఎదుర్కొన్నా.. రాబడి భారీగా పడిపోయింది. ఏకంగా రెండు లక్షల కోట్ల వరకూ పన్ను వసూళ్లు పడిపోయాయి. దాంతో, ఉన్న పథకాలకే కోతలు పెట్టాల్సి వచ్చింది. అందుకే.. ఈసారి ‘పంపిణీ పథకాల’ ఊసెత్తలేదు!

  • మాట మాట్లాడితే ట్రంపు సుంకాలంటున్నాడు! ఇప్పటికే 50 శాతం సుంకాలతో ఫార్మా, టెక్స్‌టైల్స్‌, సముద్ర ఉత్పత్తులు తదితర పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో, కిం కర్తవ్యమన్న ప్రశ్నకు తక్షణ కర్తవ్యాన్ని ఆర్థిక మంత్రి నిర్దేశించారు. ఎగుమతులను మరింత ప్రోత్సహించేలా ఆయా రంగాలకు చేయూతనిచ్చారు. మూడంచెల్లో దిగుమతులను

    తగ్గించాలని సంకల్పించారు.

1.jpg

  • ఆర్థిక వృద్ధికి మూడు కర్తవ్యాలు

ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతోపాటు పేదలు, నిస్సహాయులకు అండగా నిలవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం మూడు కర్తవ్యాలను నిర్దేశించుకున్నాం. అవి.. ఉత్పాదకత ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని పెంచడం; సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం; వనరులను, అవకాశాలను అన్ని కుటుంబాలు, వర్గాలు, రంగాలకు అందుబాటులో ఉండేలా చూడడం.. తద్వారా సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ సాధించడం.

- నిర్మల

1.jpg

  • సంస్కరణలకు కొత్త శక్తి

కేంద్ర బడ్జెట్‌ చరిత్రాత్మకం.140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తుంది. నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఓ రికార్డు. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు బడ్జెట్‌ ఊతమిస్తోంది. సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు ఇది కొత్త శక్తిని ఇస్తుంది.

- ప్రధాని నరేంద్ర మోదీ

2.jpg

  • సంక్షోభాలపై పట్టింపేది?

దేశ వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్‌ పట్టించుకోలేదు. యువతకు ఉద్యోగాల్లేవు. తయారీ రంగం పతనమైపోతోంది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోలేదు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. కుటుంబాల గృహ పొదుపు తగ్గిపోయింది. ప్రపంచదేశాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నా విస్మరించారు.

- ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ

  • ‘కష్టమ్స్‌’ తగ్గింపు.. ఎగుమతులు పెంచే వ్యూహాలు

  • దేశంలో మరిన్ని మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

  • రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కారిడార్లు.. ఏపీకి ఒకటి

  • 2047 వరకూ డేటా సెంటర్లకు ట్యాక్స్‌ హాలిడే

  • మూలధన వ్యయం లక్ష కోట్లు పెంపు

  • నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం

  • సెమీ కండక్టర్‌ పరిశ్రమకు 40 వేల కోట్లు

  • 2 లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూళ్లు

  • పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు

  • 9వసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల

  • ఎస్టీటీ దెబ్బ.. సెన్సెక్స్‌ 1,546 పాయింట్లు పతనం


జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు దీటుగా బడ్జెట్‌లో ‘స్వదేశీ మంత్రం’ పఠించారు! సుంకాలకు జంకేది లేదంటూ ఆత్మ నిర్భర అస్త్రానికి పదును పెట్టారు! ట్రంప్‌ సుంకాలతో దెబ్బతిన్న రంగాలకు ‘కస్టమ్స్‌’ తగ్గించారు! నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ‘బూస్ట్‌’ ఇచ్చారు! గ్లోబల్‌ మార్కెట్లతో కలిసిమెలిసి సాగాలని.. ఎగుమతులను మరింతగా విస్తరించాలని సంకల్పించారు! జెన్‌జీకి జైకొట్టారు! ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు సంకల్పం చెప్పుకొన్నారు! వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో మాత్రం ఎటువంటి మార్పులూ చేయలేదు. ఉద్యోగులకు ఎటువంటి ఊరట కల్పించలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో మూలధన వ్యయానికే రూ.12.21 లక్షల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం అంటే.. దాదాపు లక్ష కోట్లను పెంచారు! భారత్‌ సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చిప్‌ల కొరత! దాని పరిష్కారానికి గతంలో ఏర్పాటు చేసిన ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ను విస్తరించారు. రూ.22,919 కోట్లతో గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఎలకా్ట్రనిక్స్‌ కాంపోనెంట్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌కు కేటాయింపులను రూ.40 వేల కోట్లకు పెంచారు. అంతేనా, ఇప్పుడు ప్రపంచమంతా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ చుట్టూ తిరుగుతోంది. అందుకే, గత ఏడాది నవంబరులో ప్రారంభించిన రేర్‌ ఎర్త్‌ పర్మినెంట్‌ మాగ్నెట్స్‌ స్కీముకు కొనసాగింపుగా రేర్‌ ఎర్త్‌ కారిడార్స్‌ ఏర్పాటు చేయనున్నారు.


ఆ ఖనిజాలు అధికంగా ఉన్న ఒడిసా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చేయూత ఇవ్వనున్నారు. ఎగుమతి చేసే సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే నిర్దిష్ట ముడి సరుకులపై సుంకం లేని దిగుమతుల పరిమితిని ఒకటి నుంచి మూడు శాతానికి పెంచారు. లెదర్‌, జౌళి ఉత్పత్తులు, సింథటిక్‌ ఫుట్‌వేర్‌ ఉత్పత్తుల ఎగుమతుల గడువును ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచారు. కొన్ని రకాల రసాయనాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకే, మూడు కెమికల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, కంటెయినర్ల తయారీకి ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. అందుకే, రాబోయే ఐదేళ్లలో ఇందుకు రూ.10 వేల కోట్లను ఖర్చు చేయాలని సంకల్పించారు. బయో ఫార్మా మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుకు రూ.10 వేల కోట్లను కేటాయించారు. ట్రంప్‌ సుంకాలతో దెబ్బతిన్న టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి సమ్మిళిత, సమగ్ర వ్యూహాన్ని రచించారు. మరిన్ని మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ‘స్వదేశీ’కి మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశారు. మొదటి దశలో.. ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తున్న రక్షణ, ఇంధన, ఆరోగ్య రంగాల్లో స్వయంసమృద్ధిపై వెంటనే దృష్టి పెట్టనున్నారు. ఐదు మెడికల్‌ హబ్‌లు, మూడు ఆయుర్వేద సంస్థలను ఏర్పాటు చేస్తారు. రెండో దశలో.. ఇతర దేశాలతో పోటీ పడేలా సెమీ కండక్టర్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఎగుమతులకు పెద్దపీట వేయనున్నారు. మూడో దశలో.. దేశీయంగా సరసమైన ధరకు దొరకని ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటారు. వెరసి, ఒక్క మౌలిక సదుపాయాల రంగాని (ఇన్ర్ఫా)కే దాదాపు రూ.12 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. కాగా.. ఈసారి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరట దక్కింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో మూడు హైదరాబాద్‌ నుంచే ప్రారంభం కానున్నాయి. వీటిలో రెండు ఏపీతోనూ అనుసంధానం అవుతాయి.


ఏపీలో రేర్‌ ఎర్త్‌ మినరల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తారు. ఇక, హైదరాబాద్‌ డేటా సెంటర్ల హబ్‌గా మారిన సంగతి తెలిసిందే. విశాఖలోనూ భారీ డేటా సెంటర్లు వస్తున్నాయి. వీటిని మరింత ప్రోత్సహించేలా విదేశీ కంపెనీలకు 2047 వరకూ ట్యాక్స్‌ హాలీడే ప్రకటించారు. జిల్లాకు ఒకటి చొప్పున బాలికల వసతి గృహాలూ ఏర్పాటు కానున్నాయి. అన్నదాతకు బడ్జెట్లో పెద్దగా తాయిలాలు లేవు. కానీ, కొబ్బరి రైతులకు కోకోనట్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ ప్రకటించారు. జీడిపప్పు, కోకో, చందనం ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధికి ప్రణాళికలు రచించారు. మహిళలకు సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల తరహాలో సెల్ఫ్‌ హెల్ప్‌ మార్ట్‌లు మినహా పథకాలు ప్రకటించలేదు. ఎంఎ్‌సఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఎస్‌ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ను; రూ.2000 కోట్లతో సెల్ఫ్‌ రిలయంట్‌ ఇండియా ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చివరిగా.. బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్‌ పెదవి విరిచింది. ప్రారంభంలో పాజిటివ్‌గా కదలాడిన మార్కెట్‌ ఒక సందర్భంలో కుప్పకూలింది. సెన్సెక్స్‌ ఏకంగా 2400 పాయింట్లు పడిపోయింది. ఇందుకు కారణం.. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ను నిరుత్సాహపరచడానికి సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్టీటీ)ను ఫ్యూచర్స్‌లో 0.02 శాతం నుంచి 0.05 శాతానికి; ఆప్షన్స్‌లో 0.01 శాతం నుంచి 0.15 శాతానికి పెంచడమే.

ఏటా బడ్జెట్‌ వేళ.. చేనేత కళావైభవాన్ని చాటిచెప్పేలా నిర్మలా సీతారామన్‌ ధరించే చీరలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత కళపై తనకున్న మక్కువ చూపుతూ.. ఈ ఏడాది బడ్జెట్‌ ప్రసంగం కోసం సొంత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన కాంజీవరం చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు జరీ అంచుతో ఉన్న ముదురు ఎరుపు(మెజెంటా) రంగు చీరను ఆమె పసుపు రంగు బ్లౌజ్‌తో జత చేశారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన చీరను ధరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

85నిమిషాల పాటు సాగిన బడ్జెట్‌ ప్రసంగం

వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన నిర్మల... ఈ ఏడాది తన ప్రసంగాన్ని 85 నిమిషాల్లో క్లుప్తంగా ముగించారు. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన ప్రసంగం మధ్యాహ్నం 12:25నిమిషాలకు ముగిసింది. నిర్మలా సీతారామన్‌ గత ప్రసంగాల నిడివిని పరిశీలిస్తే.. చాలా వరకు ప్రసంగాలు 90 నుంచి 120 నిమిషాల మధ్యలో ముగిశాయి. 2020లో బడ్జెట్‌ ప్రసంగం.. ఆమె కెరీర్‌లోనే కాకుండా దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రసంగంగా రికార్డు సృష్టించింది. అప్పట్లో ఆమె 2గంటల 40నిమిషాల పాటు మాట్లాడారు. 2024లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను కేవలం 56నిమిషాల్లోనే ముగించారు. గతేడాది (2025) బడ్జెట్‌ ప్రసంగం 1గంట 14నిమిషాల పాటు, 2019లో ఆర్థికమంత్రిగా తొలి బడ్జెట్‌ ప్రసంగం 2 గంటల 17నిమిషాల పాటు కొనసాగింది.

Updated Date - Feb 02 , 2026 | 06:02 AM