Share News

సభా హక్కుల తీర్మానం చేసినా వెనక్కి తగ్గను.. రాహుల్ వీడియో

ABN , Publish Date - Feb 12 , 2026 | 08:58 PM

లోక్‌సభలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.

సభా హక్కుల తీర్మానం చేసినా వెనక్కి తగ్గను..  రాహుల్ వీడియో
Rahul Gandhi

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనుకంజ వేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు గురువారం నాడు ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. తాను నిజమే చెప్పానని, చెబుతూనే ఉంటానని రాహుల్ పేర్కొన్నారు.


బడ్జెట్ చర్చలో రాహుల్ ఏమన్నారు?

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ లోక్‌సభలో బుధవారం నాడు జరిగిన బడ్జెట్ చర్చలో తీవ్ర విమర్శలు చేశారు. 'అమెరికాతో ట్రేడ్ డీల్‌లో ఎలాంటి లాజిక్ లేదు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందకుండానే సాగిలపడింది. ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? మీరు భరతమాతను అమ్మేశారు. మీరు సిగ్గుపడాలి. అమెరికా ఒత్తిడితో మోదీ వణికిపోయారు. దేశాన్ని అమ్మేశారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు' అని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జ్ సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో గురువారం నాడు 'సబ్‌స్టాంటివ్ మోషన్' దాఖలు చేశారు. ఆ కొద్దిసేపటికే రాహుల్ స్పందించారు. తనపై ఎలాంటి హక్కుల తీర్మానం పెట్టినా నిజమే చెబుతానని, వెనుకంజ వేసేది లేదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వీడియో షేర్ చేశారు.


ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 12 , 2026 | 09:16 PM