Ancient Ornaments Unearthed: పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి.. ఆ బాలుడు ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:39 AM
గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండిలో భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా చిన్న రాగి బిందెలో అరకేజీ బరువున్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి..
ఓ బాలుడు తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా దొరికిన నిధిని అధికారులకు ఇచ్చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండికి చెందిన ప్రజ్వల్ రిట్టి 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం అతడు తమ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల ప్రాంతంలో అతడికి భూమిలో చిన్న రాగి బిందె దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో పెద్ద మొత్తంలో పురాతన బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ బంగారాన్ని అమ్ముకుంటే కుటుంబం మొత్తం హ్యాపీగా బతకొచ్చు.
కానీ, అతడు మాత్రం అలా ఆలోచించలేదు. వెంటనే గ్రామ అధికారులకు సమాచారం అందించాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామ అధికారులతో పాటు మండల, జిల్లా అధికారులు కూడా అక్కడికి వచ్చారు. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్కడే తూకం వేయగా.. దాదాపు అర కేజీ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అర కేజీ బంగారం విలువ రూ.60 లక్షలు పైనే ఉంది. ఆ ఆభరణాలు పురాతనమైనవి కాబట్టి వాటి మార్కెట్ విలువ కోటి వరకు ఉంటుందని అంచనా. ఉన్నతాధికారులు ప్రజ్వల్‌ను అభినందించారు. ఆ బంగారు ఆభరణాలను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.
ఆ బంగారు ఆభరణాలు ఏ కాలానికి చెందినవి? అక్కడికి ఎలా వచ్చాయి? అన్నదానిపై పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేయనున్నారు. వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోనున్నారు. ఈ మధ్య కాలంలో పురాతన బంగారు ఆభరణాలు తరచుగా బయటపడుతూనే ఉన్నాయి. గత నవంబర్‌లో మహారాష్ట్రలోని సిరిపంచ సమీపంలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిగాయి. ఈ సందర్భంగా రాగి బిందె ఒకటి దొరికింది. అందులో భారీ ఎత్తున బంగారం లభ్యమైంది. బిందెలో మొత్తం 36 బంగారు బిళ్లలు ఉన్నాయని, ఒక్కో బిళ్ల 23 గ్రాముల బరువు ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి..
అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!
పబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..