పోలీస్, ఖైదీ మధ్య తీవ్ర ఘర్షణ.. చివరికి ఏమైందంటే..
ABN , Publish Date - May 17 , 2026 | 07:54 PM
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పోలీస్ కానిస్టేబుల్, ఖైదీ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఖైదీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ కానిస్టేబుల్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ, నిందితుడి అడ్డుకునే ప్రయత్నంలో పోలీస్ చివరికి కాల్పులు జరపక తప్పలేదు.
పంజాబ్: హోషియార్‌పూర్‌లో పోలీస్ కానిస్టేబుల్, విచారణ ఖైదీ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఖైదీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ కానిస్టేబుల్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అతడిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీస్ చివరికి కాల్పులు జరపక తప్పలేదు. దీంతో ఖైదీ ప్రాణాలు కోల్పోగా.. కానిస్టేబుల్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
హోషియార్‌పూర్‌లోని సెంట్రల్ జైలు నుంచి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురు విచారణ ఖైదీలను శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు పోలీసులు తీసుకెళ్లారు. కోర్టు విచారణకు ముందు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వారిని అక్కడికి తరలించారు. ఈ సమయంలో ఖైదీలను పర్యవేక్షించేందుకు నలుగురు పోలీసు సిబ్బందిని నియమించారు. ముగ్గురు నిందితులను మూడు ఆటోల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం తిరిగి తీసుకెళ్లే సమయంలో ఖైదీలు పారిపోకుండా నిబంధనల ప్రకారం ఒక్కో ఖైదీకి తాడు కట్టిన కానిస్టేబుళ్లు.. దానిని తమ చేతులకు కట్టుకున్నారు.
అయితే తిరిగి వెళ్లే సమయంలో ఓ ఆటోలోని ఖైదీ నసీబ్ సింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సీనియర్ కానిస్టేబుల్ జస్‌దీప్ సింగ్‌పై దాడికి దిగాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలియదు కానీ, పదునైన ఆయుధంతో దాడి ప్రారంభించాడు. దీంతో ఆటోలో పెనుగులాట మొదలైంది. అనంతరం కిందికి దిగిన ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. మొదట జస్‌దీప్ సింగ్‌పై ఖైదీ తీవ్రంగా దాడి చేయడం ప్రారంభించాడు. పదునైన ఆయుధంతో పలుచోట్ల పొడిచాడు.
అనంతరం తేరుకున్న కానిస్టేబుల్ తుపాకీని బయటకు తీశాడు. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న కానిస్టేబుల్.. నిందితుడు పారిపోకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా ఖైదీ నసీబ్ సింగ్ పదేపదే దాడి చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. తప్పని పరిస్థితుల్లో ఖైదీపై కానిస్టేబుల్ కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో ఖైదీ నసీబ్ సింగ్ తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను వైద్య చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఖైదీ నసీబ్ సింగ్‌పై హత్య, హత్యాయత్నం సహా ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కాగా, పోలీస్-ఖైదీ మధ్య జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ అప్పీల్‌తో అధికారుల విదేశీ పర్యటనలపై గోవా సర్కార్ నిషేధం
తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విశాల్ ఎక్స్ పోస్టు..