బంగ్లా ఎన్నికల్లో ఢాకా నుంచి హిందూ అభ్యర్థి ఘన విజయం
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:27 PM
బీఎన్‌పీ నుంచి హిందూ అభ్యర్థిగా ఢాకా-3 నుంచి పోటీ చేసిన గయేశ్వర్ చంద్ర రాయ్ ఈ ఎన్నికల్లో తన సమీప జమాతే-ఇ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షహినూర్ ఇస్లాంపై విజయం సాధించారు.
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ (Tarique Rahman) సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషలిస్టు పార్టీ (BNP) అఖండ విజయం సాధించింది. 299 పార్లమెంటు స్థానాలకు గాను 212 స్థానాల్లో గెలుపు సాధించింది. బీఎన్‌పీ నేత తారిఖ్ అన్వర్ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీఎన్‌పీ నుంచి హిందూ అభ్యర్థిగా ఢాకా-3 నుంచి పోటీ చేసిన గయేశ్వర్ చంద్ర రాయ్ (Gayehwar Chandra Roy) ఈ ఎన్నికల్లో తన సమీప జమాతే-ఇ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షహినూర్ ఇస్లాంపై విజయం సాధించారు. చంద్ర రాయ్ 98,785 ఓట్లు గెలుచుకోగా, ఇస్లాంకు 82,232 ఓట్లు వచ్చాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై అమానుష దాడులు, హత్యల పరంపర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చంద్ర రాయ్ గెలుపు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎవరీ గయేశ్వర్ చంద్రరాయ్?
గయేశ్వర్ చంద్రరాయ్ 1951 నవంబర్ 1న ఢాకాలోని కెరానిగంజ్‌లో జన్మించారు. 1990 దశకంలో బీఎన్‌పీ ప్రభుత్వంలో పర్యావరణం, అడవులు, మత్స్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బీఎన్‌పీతో కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన కుమారుడు అమితవ్ రాయ్.. బీఎన్‌పీ నేత నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపుణ్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు.
యూనస్ పాలనకు తెర
కాగా, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 150 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండాలి. తాజా ఫలితాల్లో 212 స్థానాల్లో విజయం సాధించినట్టు బీఎన్‌పీ ప్రకటించింది. జమాతే-ఇ-ఇస్లామీ 70 సీట్లకే పరమితమై ఓటమిని అంగీకరించింది. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని 18 నెలల తాత్కాలిక ప్రభుత్వాన్ని తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో ఇటీవల కాలంలో దెబ్బతిన్న భారత్-బంగ్లా మైత్రీ సంబంధాలు తిరిగి పట్టాలమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు
రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా