Share News

రెండోసారి సీఎం పగ్గాలు...హిమంత క్యాబినెట్‌లో ఆ నలుగురు

ABN , Publish Date - May 12 , 2026 | 10:57 AM

సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గంలోకి తీసుకునే నలుగురు మంత్రుల పేర్లను శర్మ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. శర్మతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారిలో రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ ఉన్నారు.

రెండోసారి సీఎం పగ్గాలు...హిమంత క్యాబినెట్‌లో ఆ నలుగురు
Himanta Biswa sarma

గువాహటి: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మంగళవారంనాడు వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.40 గంటలకు గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లో జరిగే ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.


ప్రమాణస్వీకారానికి ముందు మంత్రివర్గంలోకి తీసుకునే నలుగురు మంత్రుల పేర్లను శర్మ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థి పేరును కూడా వెల్లడించారు. శర్మతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారిలో రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రంజిత్ దాస్ అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులవుతారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త టీమ్‌తో కలిసి పూర్తి అంకితభావంతో పటిష్టమైన, మరింత అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన అస్సాంను నిర్మిస్తామని శర్మ తెలిపారు.


బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 126 స్థానాల్లో ఎన్డీయే 102 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 82 సీట్లు దక్కించుకోగా, భాగస్వామ్య పార్టీలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి 19 సీట్లు వచ్చాయి.


ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకేలో తిరుగుబాటు.. విజయ్ టీవీకేకు షణ్ముగం వర్గం మద్దతు

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్

Updated Date - May 12 , 2026 | 12:10 PM