అన్నాడీఎంకేలో తిరుగుబాటు.. విజయ్ టీవీకేకు షణ్ముగం వర్గం మద్దతు
ABN , Publish Date - May 12 , 2026 | 10:03 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా ఆ పార్టీలోని షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగంకు మద్దతు ప్రకటించింది.
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే (AIADMK)లో లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా ఆ పార్టీలోని సీవీ షణ్ముగం (CV Shanmugam) వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK)కు మద్దతు ప్రకటించింది. ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేతో చేతులు కలపాలని అన్నాడీఎంకే అనుకుందని, అందుకే పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోయామని మీడియాతో మంగళవారంనాడు మాట్లాడుతూ షణ్ముగం తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. వరుస ఓటములకు పళనిస్వామే కారణమని విమర్శించారు. పార్టీ పదవి నుంచి ఆయన దిగిపోవాలని డిమాండ్ చేశారు.
అన్నాడీఎంకే గత దశాబ్ద కాలంగా పలు ఓటములను చవిచూసిందని, మూడుసార్లు చిరకాల ప్రత్యర్థి డీఎంకే చేతిలో ఓడిపోతే, గత నెలలో టీవీకే చేతిలో మరో ఓటమి చవిచూసిందని షణ్ముగం తెలిపారు. పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్నాడీఎంకే భవిష్యత్తుపై కూలంకషంగా చర్చించాలని అన్నారు.
'ఎన్నికల్లో విజేతగా నిలిచిన టీవీకేకు మద్దతివ్వాలని మేము నిర్ణయించాం. డీఎంకేకు వ్యతిరేకంగానే అన్నాడీఎంకే పార్టీని స్థాపించడం జరిగింది. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే పార్టీ రాజకీయాలు నడిచాయి. చరిత్ర ఇలా ఉంటే డీఎంకే మద్దతుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అయితే మెజారిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అంటే అన్నాడీఎంకే సొంత ఉనికి కోల్పోవడమే అవుతుంది. ప్రస్తుతం మా దృష్టి ఉంతా పొత్తులపై లేదు. సొంత పార్టీని పునరుద్ధరించి, పటిష్టం చేయడమే మా ఉద్దేశం. అంతిమంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం' అని షణ్ముగం తెలిపారు.
పార్టీని చీల్చే ఉద్దేశం లేదు
సొంత పార్టీని చీల్చే ఉద్దేశం లేదని షణ్ముగం వివరణ ఇచ్చారు. పార్టీ కీలక నాయకత్వంపై పోరాటంగా దీనిని పేర్కొన్నారు. ముఖ్యంగా విజయ్, టీవీకేతో పొత్తుకు గత వారంలో నిరాకరించిన మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా తామంతా తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
ఇవి కూడా చదవండి..