అన్నాడీఎంకేలో సంక్షోభం
ABN , Publish Date - May 12 , 2026 | 05:41 AM
తమిళనాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నెలకొంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎ్‌స)ని...
పళనిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్న 17 మంది ఎమ్మెల్యేలు
వేలుమణికి మద్దతుగా 30 మంది
టీవీకేతో పొత్తుకు మణి వర్గం సిద్ధం
చెన్నై, మే 11(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నెలకొంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎ్‌స)ని శాసనసభా నేతగా ఎన్నుకుంటూ 17 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ కరుప్పయ్యకు లేఖ రాశారు. అదేసమయంలో సీనియర్ నేత ఎస్‌పీ వేలుమణిని శాసనసభానేతగా, సీవీ షణ్ముగంను డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నుకుంటూ మరో 30 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. దీంతో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడడం ఖాయమని తెలుస్తోంది. అదేసమయంలో చీలిక వర్గం అధికార టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందే పలువురు నేతలు బీజేపీతో పొత్తును వ్యతిరేకించి, టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని ఈపీఎ్‌సకు చెప్పారు. అయితే, ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిళ్లు, టీవీకే నుంచి ఎదురైన డిమాండ్ల నేపథ్యంలో ఈపీఎస్ బీజేపీతో పొత్తుకే మొగ్గు చూపారు. కానీ, ఇప్పుడు విజయ్ పార్టీ అధికారంలోకి రావడంతో అసమ్మతి ఎమ్మెల్యేలు ఎస్‌పీ వేలుమణి, సీవీ షణ్ముగం, సి. భాస్కర్ తదితరుల నేతృత్వంలో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి ప్రత్యేకంగా వచ్చారు. అంతేకాదు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కాకుండా వేరుగా కూర్చున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే ముందుగానీ, ఆ తర్వాత గానీ తమ అధినేత ఈపీఎస్ వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. అదేసమయంలో వారంతా విజయ్‌కు నమస్కరించడం గమనార్హం. తర్వాత కొద్దిసేపటికి సోమవారం మధ్యాహ్నం 17 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఈపీఎ్‌సను ఎన్నుకుంటున్నట్లు ప్రొటెం స్పీకర్‌కు లేఖ అందించారు. కానీ, సాయంత్రానికి 30 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎస్పీ వేలుమణిని, ఉపనేతగా సీవీ షణ్ముగంను ఎన్నుకున్నట్లు లేఖ అందించారు. 47 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకేలో 30 మంది తిరుగుబాటు చేస్తే వారిపై ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. టీవీకే ప్రభుత్వానికి తాము అండగా ఉండాలని, బుధవారం అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో మద్దతు ఇవ్వాలని వేలుమణి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్