స్టాలిన్ ఇంటికి విజయ్
ABN , Publish Date - May 12 , 2026 | 06:07 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్ష నేతల నివాసాలకు వెళ్లారు...
ఇతర విపక్ష నేతల నివాసాలకూ
వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి
స్టాలిన్, వైగోలకు ఆత్మీయ పలకరింపు
సంభ్రమాశ్చర్యాలకు గురైన నాయకులు
ఆత్మీయ స్వాగతం పలికిన మాజీ సీఎం
తమిళనాట కొత్త సాంప్రదాయం
సీఎం చర్యతో విపక్ష నేతల్లో ఆనందం
కక్ష పూరిత రాజకీయాలకు చెక్
‘మచ్చిక’ రాజకీయమన్న అన్నాడీఎంకే
చెన్నై, మే 11(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్ష నేతల నివాసాలకు వెళ్లారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్‌గా శివశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విజయ్.. నేరుగా స్థానిక ఆళ్వారుపేటలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. అక్కడ స్టాలిన్ తనయుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి బయటకు వచ్చి విజయ్‌ను ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. అనంతరం సమావేశ హాలు బయటి వరకు వచ్చిన స్టాలిన్.. విజయ్‌ను ఆత్మీయాలింగనం చేసుకుని చేయి పట్టుకుని సోఫా వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అనంతరం స్టాలిన్ విజయ్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఆ ఇద్దరు నేతలు 5 నిముషాలకు పైగా చర్చించుకున్నారు. ఈ భేటీలో ఉదయనిధి కూడా పాల్గొన్నారు. అనంతరం ఉదయనిధి బయటి వరకు వచ్చి సీఎం విజయ్‌కు వీడ్కోలు పలికారు. స్టాలిన్‌తో భేటీ అనంతరం ఎండీఎంకే అధినేత వైగో నివాసానికి కూడా విజయ్ వెళ్లారు. ఆయనతో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అదేవిధంగా పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి, ఎన్‌టీకే నేత సీమాన్ తదితరుల నివాసాలకు కూడా వెళ్లిన విజయ్ మర్యాదపూర్వకంగా వారిని కలిశారు.
ఆశీస్సులందించా: స్టాలిన్
తమ భేటీ అనంతరం స్టాలిన్ ఎక్స్‌లో స్పందించారు. విజయ్ తనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని, కొన్ని సలహాలు, సూచనలు చేశానని తెలిపారు. ఎండీఎంకే నేత వైగో విడుదల చేసిన ప్రకటనలో.. విజయ్ అన్నాదురైని తలపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం విజయ్ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాట.. అధికారంలో ఉన్న వారికి, ప్రతిపక్షంలో ఉన్నవారికి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉండేవి. అలాంటి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని, విపక్ష పార్టీల నాయకులను వారి నివాసాలకు వెళ్లి మరీ కలుసుకోవడం ద్వారా సీఎం విజయ్ సరికొత్త సంప్రదాయానికి తెరదీశారన్న చర్చ సాగుతోంది. అయితే, పరిపాలనకు తాను కొత్త అయినందున.. ఏదైనా తప్పులు జరిగినా, ముందు జాగ్రత్త చర్యగా ప్రతిపక్ష నేతలను కట్టడి చేసేందుకే సీఎం విజయ్ ఈ స్నేహగీతిక ఆలపిస్తున్నారని అన్నాడీఎంకేలోని ఓ నేత వ్యాఖ్యానించారు. కాగా, తమిళ అసెంబ్లీలో అధికార-ప్రతిపక్ష నేతలిద్దరూ కొత్తవారే కావడం యాదృచ్ఛికం. సీఎం పీఠంలో విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రలో ఉదయనిధి ఉన్నారు. మరోవైపు, విజయ్‌కు కేంద్రప్రభుత్వం 55మందికి పైగా భద్రతా సిబ్బందితో జడ్ ప్లస్ భద్రత కల్పించింది.
సీఎంకు దిష్టి తీసిన
వైగో ఇంటి పనిమనుషులు
తన నివాసానికి వచ్చిన విజయ్‌తో భేటీ ముగిశాక వైగో తన పార్టీ నేతలను పరిచయం చేశారు. అదే సమయంలో తన ఇంట్లో పని చేసే మహిళలు కూడా విజయ్‌ను కలుసుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని కూడా పిలిచి విజయ్‌తో ఫొటో దిగాలని సూచించారు. ఆ సమయంలో విజయ్ వద్దకు వచ్చిన ఓ మహిళ.. కలకాలం చల్లగా ఉండాలంటూ చేతులతోనే ఆయనకు దిష్టి తీశారు. తమ కుటుంబమంతా విజయ్ పార్టీకే ఓటేశామని చెప్పారు. దీనిపై ఎలా స్పందించాలో అర్థంగాక వైగో అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్