ఒత్తిడితో భారత్‌ను లొంగదీసుకోలేరు!
ABN , Publish Date - May 12 , 2026 | 06:09 AM
ఒత్తిళ్లు తెచ్చి భారత్‌ను లొంగదీసుకునే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా.. వాజపేయి ప్రభుత్వ హయాంలో పోఖ్రాన్‌లో జరిపిన...
ప్రపంచంలో ఆ శక్తి ఎవరికీ లేదు: ప్రధాని మోదీ
1951 మే 11న సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ
పోఖ్రాన్‌లో అణుపరీక్షలు జరిపిందీ మే 11నే
దేశానికే తొలి ప్రాధాన్యమని అప్పుడే చాటాం
సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో మోదీ వెల్లడి
ఆలయంలో మహాపూజ, జలాభిషేకం
సోమనాథ్(గుజరాత్), మే 11: ఒత్తిళ్లు తెచ్చి భారత్‌ను లొంగదీసుకునే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా.. వాజపేయి ప్రభుత్వ హయాంలో పోఖ్రాన్‌లో జరిపిన అణుపరీక్షల గురించి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జాతి ఆత్మగౌరవాన్ని కాదని.. బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే శక్తులు దేశంలో ఉన్నాయన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఇదే మనస్తత్వంతో వ్యతిరేకించారని ఆక్షేపించారు. ‘1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. 1951 మే 11న సోమనాథ్ ఆలయ ప్రాణప్రతిష్ఠ.. సిసలైన స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ అమృత మహోత్సవ్ గతాన్ని నెమరువేసుకునే సందర్భం మాత్రమే కాదు.. వచ్చే వెయ్యేళ్ల వరకు భారత్‌కు స్ఫూర్తిగా నిలుస్తుంది. మే 11 ఎంతో కీలకమైన రోజు. 1951లో ఇదే రోజు సోమనాథ్ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. మళ్లీ 1998లో ఇదే రోజున భారత్ అణుపరీక్షలు నిర్వహించింది. మన శాస్త్రవేత్తలు భారత సత్తా, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచానికి చాటారని నాటి ప్రధాని వాజపేయి ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేగాయి. పలు దేశాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లతో భారత్‌ను ఒంటరిని చేసేందుకు అగ్రరాజ్యాలు ప్రయత్నించాయి. మన ఆర్థిక పురోగతికి అడ్డంకులు సృష్టించాయి. ఇలాంటి పరిస్థితులు వస్తే చాలా దేశాలు లొంగిపోతాయి. కానీ భారత్ దృఢంగా నిలిచింది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినా.. రెండ్రోజులకే అంటే మే 13న మరో రెండు అణు పరీక్షలు నిర్వహించింది. భారత రాజకీయ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది’ అని తెలిపారు. దేశానికే తొలి ప్రాధాన్యమని వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తేల్చిచెప్పిందన్నారు. పదే పదే దండయాత్రలతో సోమనాథ్ వైభవాన్ని తుడిచిపెట్టేయాలని దురాక్రమణదారులు భావించారని.. ఆలయాన్ని ఎన్ని సార్లు ధ్వంసం చేసినా పునర్నిర్మాణం జరిగిందని చెప్పారు. జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలనూ మన దేశంలో రాజకీయం చేస్తారని, సోమనాథ్ దీనికి నిదర్శనమని అన్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం సర్దార్ పటేల్, ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ అపారమైన కృషిచేశారని.. ప్రథమ ప్రధాని నెహ్రూ ఎంతో వ్యతిరేకించారని తెలిపారు.
ఒకటిన్నర కిమీ రోడ్‌షో
తొలుత ప్రధాని హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్‌జీ సర్కిల్ వరకు ఒకటిన్నర కిలోమీటర్లు రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజలు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. దారిపొడవునా పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. తర్వాత ఆయన ఆలయంలో ప్రవేశించి మహాపూజ, శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలను క్రేన్ ద్వారా ఆలయ శిఖరంపై చల్లుతూ జరిపిన కుంభాభిషేకాన్ని వీక్షించారు. గగనతలంలో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబిక్స్ టీం ‘ఎయిర్‌షో’ను సైతం తిలకించారు. సూర్యకిరణ్ యుద్ధవిమానాల నుంచి వదిలిన త్రివర్ణాల పొగ ఆకాశంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ఆలయ ప్రతిష్ఠ జరిగి 75 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రధాని ప్రత్యేక స్టాంపును కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి సైతం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్