సిక్కింలో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి కూలిన ఇళ్లు
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:30 PM
సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన భీకర వర్షాలకు వరదలు వచ్చాయి. వర్షాలకు వెస్ట్ సిక్కింలోని యుక్సోం-తషిడింగ్ పరిధిలోని రింబి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇల్లు ధ్వంసమయ్యాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన భీకర వర్షాలకు వరదలు వచ్చాయి. వర్షాలకు వెస్ట్ సిక్కింలోని యుక్సోం-తషిడింగ్ పరిధిలోని రింబి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇల్లు ధ్వంసమయ్యాయి. దాంతోపాటు ఇళ్ల శకలాలు, బురదతో కూడిన వరద లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అయితే, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అలాగే, రాజధాని గ్యాంగ్‌టక్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. బురదతో కూడిన వరద రోడ్లపై ప్రవహించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గ్యాంగ్‌టక్ జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ) అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం రింబి గ్రామంలో వారు పర్యటించారు. ఇళ్లు డ్యామేజ్ అయిన బాధితులతో మాట్లాడారు. అలాగే బోజోగ్‌హరి సమీపంలోని లూయింగ్-రంకా హైవే, లింగ్‌డింగ్, హైకోర్ట్ రోడ్, టీఎన్ఏ గేట్, వీఐపీ కాలనీ, పంగ్‌థాంగ్-లింగ్‌డాక్ రోడ్, పమ్రో గాన్, ఫెన్‌జాంగ్ తదితర ప్రాంతాలను కూడా పరిశీలించారు.
స్తంభించిన రోడ్డు రవాణా
కొండచరియలు, వరదల కారణంగా వెస్ట్ సిక్కింలోని పలు ప్రాంతాల్లో రోడ్డు రవాణా స్తంభించిపోయింది. అలాగే సిచీలోని సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ప్రజా మౌలిక సదుపాయాలకూ నష్టం వాటిల్లింది. ఎంచెయ్ స్కూల్ వద్ద బురద పేరుకుపోయింది. ముందుజాగ్రత్త చర్యగా వర్షపు నీరు రాకుండా కొన్ని చోట్ల టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేశారు. రోడ్లపై బురద, శకలాలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని అధికారులను జిల్లా కలెక్టర్, డీడీఎంఏ చైర్మన్ ఆదేశించారు. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం చేయాలని సూచించారు. అలాగే కొండచరియలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి:
కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!
ఆసియా రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం