Share News

కంబోడియా ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు 12 గంటల పెరోల్

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:58 PM

హర్యానాలోని ఝజ్జర్ జైల్లో జీవితకాలం శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ మైన్‌పాల్ ధిల్లాకు బుధవారం పెరోల్ లభించింది. కంబోడియాకు చెందిన తన ప్రియురాలు మెటా చాన్‌ను పెళ్లి చేసుకునేందుకు అధికారులు అతనికి 12 గంటల పెరోల్‌ జారీ చేశారు.

కంబోడియా ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు 12 గంటల పెరోల్

ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాలోని ఝజ్జర్ జైల్లో జీవితకాలం శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ మైన్‌పాల్ ధిల్లాకు బుధవారం పెరోల్ లభించింది. కంబోడియాకు చెందిన తన లవర్ మెటా చాన్‌ను పెళ్లి చేసుకునేందుకు అధికారులు అతనికి 12 గంటల పెరోల్‌ జారీ చేశారు. దీంతో గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ధిల్లా పెరోల్‌పై ఉన్నాడు. జైలు సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో ధిల్లా, మెటా వివాహం చేసుకోనున్నారు. తర్వాత అధికారులు అతడిని తమ కస్టడీలోని తీసుకుని మళ్లీ జైలుకు తరలించనున్నారు.


ధిల్లా, మెటాకు నలుగురు పిల్లలు

హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బద్లీకి చెందిన మైన్‌పాల్ ధిల్లాపై వివిధ క్రిమినల్ కేసులతో పాటు మొత్తం 22 కేసులు నమోదై ఉన్నాయి. 2007, 2010లో మూడు కేసుల్లో దోషిగా తేలడంతో హిసార్ జైల్లో అతను శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా జైల్లో ఉన్నపుడు ఒక వ్యక్తిని హత్య చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2018 జులైలో ఆరు వారాల పెరోల్‌పై విడుదల అయ్యాడు. తర్వాతి నెలలో సోను కుమార్ అనే పేరుతో నకిలీ గుర్తింపును ఉపయోగించి కంబోడియాకు పారిపోయాడు. కంబోడియాలోనూ తన గుర్తింపును మార్చుకుని ఒక వ్యాపారం ప్రారంభించాడు. ఇదే క్రమంలో మెటా చాన్‌ను కలిశాడు. ఇద్దరూ సహజీవనం చేసి నలుగురు పిల్లలను కన్నారు.


కాగా.. కంబోడియాలో ధిల్లా ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు ఆ దేశం నుంచి సమాచారం అందింది. తర్వాత హర్యానా పోలీసుల విజ్ఞప్తి మేరకు సీబీఐ పోలీసులు 2024 నవంబరులో అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేశారు. కంబోడియా అధికారుల సహాయంతో 2025 జులైలో అతడి ఆచూకీని గుర్తించారు. నిరుడు సెప్టెంబరులో కంబోడియా అధికారులు అతడిని భారత్‌కు అప్పగించారు. ఇక, వారి పెళ్లికి ముగ్గురు పిల్లలు కూడా హాజరు కానున్నారు. నాలుగో పిల్లవాడు కంబోడియాలోనే ఉన్నాడు. ధిల్లా ప్రియురాలు మెటా తమ ముగ్గురు పిల్లలతో భారత్‌కు చేరుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

Updated Date - Sep 24 , 2026 | 06:04 PM