Share News

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:21 PM

ఎప్‌స్టీన్‌ను తాను కలిసిన మాట నిజమేనని, అయితే ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధుల బృందంలో భాగంగానే తాను ఆయనను కలిశానని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి
Hardeep Singh Puri

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein Files) గురించి లోక్‌సభలో తనపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తీవ్రంగా ఖండించారు. ఎప్‌స్టీన్‌ను తాను కలిసిన మాట నిజమేనని, అయితే ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ (IPI) ప్రతినిధుల బృందంలో భాగంగానే తాను ఆయనను కలిశానని చెప్పారు.


బుధవారంనాడిక్కడ మీడియాతో హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, సంస్థల మధ్య పరస్పర చర్చలకు సంబంధించిన పరిధిలోనే ఎప్‌స్టీన్‌ను కలిసినట్టు చెప్పారు. ఆయనపై (ఎప్‌స్టీన్) వచ్చిన ఆరోపణలకు, తమ మధ్య జరిగిన సంభాషణలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.


'మా బాస్‌కు ఎప్‌స్టీన్ తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను అతన్ని కలిసాను. ప్రతినిధుల బృందంలో భాగంగా 3-4 సందర్భాల్లోనే సమావేశమయ్యాం. ఎప్‌స్టీన్‌పై ఉన్న ఆరోపణలకు, మా సమావేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన కార్యకలాపాలపై కూడా నాకెలాంటి ఆసక్తి లేదు' అని హర్దీప్ సింగ్ అన్నారు. 30 లక్షల ఈమెయిల్స్‌లో కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే తన పేరు ప్రస్తావన వచ్చిందని చెప్పారు. ప్రతినిధి బృందంలో భాగంగానే ఎప్‌స్టీన్‌ను తాను కలిశానని, ఒక్కసారి మాత్రమే ఈమెయిల్ చేసుకున్నామని, ఆ ఈమెయిల్స్‌ను రాహుల్ చదవాలని సూచించారు. ఎప్‌స్టీన్‌తో సంభాషణల్లో కేవలం 'మేక్ ఇన్ ఇండియా' గురించే మాట్లాడుకున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీ బడ్జెట్ చర్చలో 'ఎప్‌స్టీన్' ప్రస్తావన చేస్తారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో హర్దీప్ పూరి పేరు ఉందన్నారు. దానిపైనే హర్దీప్ పూరి తాజా వివరణ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్‍పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం.. కిరణ్ రిజిజు

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

Updated Date - Feb 11 , 2026 | 06:28 PM