Share News

రాహుల్‍పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం.. కిరణ్ రిజిజు

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:20 PM

లోక్‌సభలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి, సభను తప్పుదారి పట్టించిన విపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

రాహుల్‍పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం.. కిరణ్ రిజిజు
Kiran Rijiju and Rahul Gandhi

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి, సభను తప్పుదారి పట్టించిన విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Notice) ఇవ్వనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijuju) తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై బడ్జెట్‌ చర్చలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. వీటిని మంత్రి రిజిజు తోసిపుచ్చారు.


రాహుల్ గాంధీ బడ్జెట్ ప్రసంగాన్ని కిరణ్ రిజిజు ప్రస్తావిస్తూ.. 'రాహుల్ గాంధీ సభను తప్పుదారి పట్టించారు. నిరాధార ఆరోపణలు చేశారు. దీనిపై మేము సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం. ఉభయసభల్లోనూ సభా కార్యక్రమాల నిర్వహణకు స్పష్టమైన నియమ, నింబంధనలు ఉన్నాయి. ఒక సభ్యుడు మరో సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేయాలనుకుంటే నోటీసు ఇవ్వాలి, ఆరోపణలను రుజువు చేయాలి' అని అన్నారు. తన వాదనలను నిరూపించే ఆధారలతో సభకు రావాల్సిందిగా రాహుల్‌కు సూచించాలని సభాపతికి తాను కోరనున్నట్టు చెప్పారు.


ఏ ఆధారంతో ఆ మాటలు అంటారు?

ప్రధానిపైన, ప్రభుత్వంపైన రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని రిజిజు చెప్పారు. 'ప్రధానమంత్రి దేశాన్ని, దేశ ప్రయోజనాలను అమ్మేశారని ఆయన చెబుతున్నారు. దీనికి ఆధారాలున్నాయా? ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై కూడా రాహుల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు' అని రిజిజు చెప్పారు. ఎలాంటి సాక్ష్యాలు, విధానపరమైన నోటీసులు లేకుండా రాహుల్ ఈ ఆరోపణలు చేశారని, ఆయన చేసిన తప్పుడు ఆరోపణలు, అమర్యాదకర వ్యాఖ్యలతో సహా ఆయన ప్రసంగం మొత్తాన్ని రికార్డుల నుంచి తొలగించాలని, ముఖ్యంగా ఆయన చెప్పిన అబద్ధాలు, నిరాధార ఆరోపణలను తొలగించాలని అన్నారు.


ఎవరూ దేశాన్ని అమ్మలేరు..

దేశాన్ని అమ్మేశారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రిజిజు మండిపడ్డారు. ఏ ఒక్కరూ దేశాన్ని అమ్మడం కానీ, కొనడం కానీ చేయలేరని అన్నారు. కనీసం ఊహించడం కూడా సాధ్యం కాదని అన్నారు.


రాహుల్ ఏమన్నారంటే..

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా 'భరతమాతను అమ్మేశారు' అని రాహుల్ తన ప్రసంగంలో ప్రభుత్వంపై తీవ్రారోపణలు చేశారు. ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలపై రాజీపడ్డారని, గుత్తగా లొంగిపోయారని విమర్శించారు. అదే కనుక 'ఇండియా' కూటమి ప్రభుత్వం ట్రేడ్‌డీల్‌పై సంప్రదింపులు జరిపి ఉంటే ఇండియాను సమాన భాగస్వామిగా గుర్తించాలని అమెరికాకు గట్టిగా చెప్పి ఉండేవాళ్లమని అన్నారు. 'మీరు ఇండియాను అమ్మేశారు. ఇది సిగ్గుగా అనిపించడం లేదా? మీరు మన తల్లి భరతమాతను అమ్మేశారు' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశ ఇంధన భద్రత ఇప్పుడు బలహీనమైందని, అమెరికా నిర్ణయాలపై ఆధారపడి చమురు కొనాల్సి వస్తుందని అన్నారు. రైతుల ప్రయోజనాలపై కేంద్రం రాజీపడిందని, ఇప్పుడు దేశీయ మార్గెట్‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు వరదలా వచ్చిపడతాయని చెప్పారు. టెక్స్‌టైల్ పరిశ్రమపై ఇప్పటికే తీవ్ర ప్రభావం పడిందని, ప్రస్తుత విధానాలతో ఆ రంగం పూర్తిగా ఫినిష్ అయినట్టేనని అన్నారు. యుద్ధాల శకం ముగిసిందని ప్రధానమంత్రి మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోభాల్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, నిరంతర ఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవం అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

Updated Date - Feb 11 , 2026 | 05:46 PM