'నా దీపావళి గిఫ్ట్ ఎక్కడ?'.. కారును ఆపి బహుమతి అడిగిన హోంగార్డు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 09 , 2026 | 12:19 PM
దీపావళి పండుగ వేళ హర్యానా పోలీసుల తీరు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. విధుల్లో ఉన్న హోంగార్డు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి వాహనదారుల నుంచి దివాళీ బహుమతులు డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది.
హర్యానా, నవంబర్ 9: దీపావళి పండుగ వేళ హర్యానా పోలీసుల తీరు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. విధుల్లో ఉన్న హోంగార్డు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి వాహనదారుల నుంచి దివాళీ బహుమతులు డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈనెల 7న చోటుచేసుకుంది.
ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్ వికాస్ దయాల్ తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా విధుల్లో ఉన్న ఓ హోంగార్డు వారి వాహనాన్ని ఆపారు. డ్రైవర్ సీటులో ఉన్న వికాస్ వద్దకు హోంగార్డు రాగా.. ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఆ పోలీస్ 'నా దీపావళి బహుమతి ఎక్కడ?' అని అడిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో హోంగార్డు, వికాస్ కుటుంబ సభ్యుల మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అయితే, వికాస్ కుటుంబం ఆయనకు నగదు చెల్లించేందుకు సిద్ధమైంది. గూగుల్ పే, యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తామని చెప్పినప్పటికీ హోంగార్డు అందుకు నిరాకరించారు. అంతేకాదు, కారులో ఏమైనా విలువైన బహుమతులు ఉన్నాయా? అని ఆరా తీశారు.
ఏదో ఒక వస్తువును బహుమతిగా ఇస్తామని వికాస్ కుటుంబం ముందుకొచ్చినా, తనకు నచ్చిన వస్తువే ఇవ్వాలని హోంగార్డు పట్టుపట్టారు. అనంతరం విలువైన వస్తువుల కోసం కారులో వెతకడం ప్రారంభించారు. చివరికి తనకు నచ్చిన వస్తువును తీసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన వికాస్ దయాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే వీడియో వైరల్ కాగా.. పోలీసుల తీరుపై విమర్శలు వెలువెత్తాయి. విధుల్లో ఉన్న సిబ్బంది ఇలా బహుమతులు అడగడం ఏంటంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దీనిపై గురుగ్రామ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. అలాగే, సంబంధిత హోంగార్డుపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. భద్రత కల్పించాల్సిన పోలీసులే దోపిడీకి పాల్పడితే ప్రజల పరిస్థితి ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అనిరుధ్-కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌కు రజనీకాంత్, స్టాలిన్!
బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. ఏ ప్రాంతంలో ఎంతంటే..