Share News

మైనర్ పిల్లలపై ఆరోపణలా... హిమంతపై గొగోయ్ ఆగ్రహం

ABN , Publish Date - Feb 09 , 2026 | 08:57 PM

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై ఆయన వివాదాలు సృష్టిస్తున్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ గౌరవ్ గొగోయ్ చెప్పారు.

మైనర్ పిల్లలపై ఆరోపణలా... హిమంతపై గొగోయ్ ఆగ్రహం
Gourav Gogoi, Himanta Biswa Sarma

గువాహటి: అస్సాంలో రాజకీయ వాతావరణం సోమవారంనాడు ఒక్కసారిగా వెడెక్కింది. తన కుటుంబానికి పాకిస్థాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సంబంధాలున్నాయంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) మండిపడ్డారు. 'సిట్' నివేదికను ముఖ్యమంత్రి తొక్కిపెట్టారని ఆరోపించారు. తన భార్య, మైనర్ పిల్లలను కూడా ఇందులోకి లాగారని, వారిపై అసంబద్ధమైన, తప్పుడు ఆరోపణలు చేసిన సీఎంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు.


గొగోయ్ 2013లో పాకిస్థాన్ వెళ్లడాన్ని హిమంత బిశ్వ శర్మ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తాజాగా ప్రశ్నించారు. వీసా పర్మిషన్ ఉన్న ప్రాంతాలకు, ఆయన పర్యటించిన లొకేషన్లకు మధ్య తేడాలున్నాయని అన్నారు. తక్షశిల అంటూ గొగోయ్ చెప్పిన ప్రదేశం ఇస్లామాబాద్‌లో లేదని, పాకిస్థాన్‌లోని రావల్పిండి జిల్లాలో ఉందని అన్నారు. ఇది అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లకు మాత్రమే పర్యటనకు వీసా అనుమతిస్తుంటే ఆయన తక్షశిల ఎలా వెళ్లారని నిలదీశారు. నిర్దేశించిన ప్రదేశాల్లో మినహా ఇతర చోట్లకు వెళ్లేందుకు పాకిస్థాన్ ఇమిగ్రేషన్ రూల్స్ అనుమతించవన్నారు. రావల్పిండిలో పాకిస్థాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉందన్నారు. గొగోయ్‌ వెళ్లడానికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు.


భూముల వ్యవహారం నుంచి దారి మళ్లించేందుకే..

శర్మ ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ వెంటనే స్పందించారు. శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై వివాదాలు సృష్టిస్తున్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ గొగోయ్ చెప్పారు. తనకు పాక్‌తో సంబంధాలున్నట్టు రుజువు చేసే ఎలాంటి సమాచారం లేకపోవడంతో 'సిట్' నివేదికను ముఖ్యమంత్రి తొక్కిపెట్టారని తెలిపారు. ఆయన చెప్పినట్టు ఇది జాతీయ భద్రతా అంశమే అయితే ఆరు నెలలుగా ఎందుకు ఖాళీగా కూర్చున్నారని ప్రశ్నించారు. 'సిట్ నివేదికలో ఎలాంటి రుజువులు లేవన్నదే అసలైన నిజం' అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జనసమీకరణ జరుపుతుండటం, ప్రజాదరణ పెరుగుతుండటం చూసి ముఖ్యమంత్రి ప్రెస్‌కాన్ఫరెన్స్ అంటూ తనపై ఆరోపణలు దిగారని తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబానికి 12,000 బిఘాల భూములున్నట్టు తాము వెల్లడించడంతో ఆయన తాజా డ్రామాకు తెరలేపారని అన్నారు.


పాకిస్థాన్‌తో సంబంధాలు అవాస్తవం

తన భార్య పాకిస్థాన్‌కు వెళ్లడం నిజమేనని, అయితే వృత్తి సంబంధమైన పనిలో భాగంగానే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని గొగోయ్ చెప్పారు. ఆమెతో పాటు తాను 2013లో పది రోజుల పాటు పాక్ వెళ్లానని, ఇందులో రహస్యం కానీ చట్టవ్యతిరేకం కానీ ఏదీ లేదని వివరించారు. విచారణలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై కూడా గొగోయ్ తోసిపుచ్చారు. సిట్ తన పని తాను చేసుకు వెళ్తుందని, సిట్ తన నివేదికను బహిర్గతం చేయాలని తాను మొదటి రోజు నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రి తన మైనర్ పిల్లలను కూడా ఇందులోకి లాగడంపై గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పిల్లలను కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. మాకు కూడా ఆయన పిల్లలు తెలుసు. ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ కుటుంబాలను మేము రాజకీయాల్లోకి లాగం' అని గొగోయ్ అన్నారు.


సీఎం చేస్తున్న ఆరోపణలు రాష్ట్రానికి సిగ్గుచేటని, తప్పుడు సమాచారం, సోషల్ మీడియా వీడియోలతో విషప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. మతపరమైన విద్వేషాలు సృష్టించేందుుక ఒక వర్గాన్ని ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియో ఆధారంగా పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలని కోరారు. తన పిల్లలను కామెంటు చేసిన ముఖ్యమంత్రిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని గొగోయ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

Updated Date - Feb 09 , 2026 | 08:59 PM