Dense Fog Tragedy: పొగమంచు వల్ల హృదయ విదారకంగా టెకీ మరణం..
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:29 PM
దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే...
గ్రేటర్ నొయిడా, జనవరి 18: దట్టమైన పొగమంచు కారణంగా శుక్రవారం రాత్రి గ్రేటర్ నొయిడా సెక్టార్ 150లో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా మృతి చెందాడు. గురుగ్రామ్‌లోని డన్‌హమ్బీ ఇండియాలో పనిచేస్తున్న యువరాజ్ శుక్రవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
పొగమంచు వల్ల వెలుతురు చాలా తక్కువగా ఉండటం, స్ట్రీట్ లైట్స్ కాంతులు, రిఫ్లెక్టర్లు లేకపోవడం కారణంగా యువరాజ్ తన గ్రాండ్ విటారా SUVను షార్ప్ టర్న్(ATS Le Grandiose సమీపంలో) తీసుకుంటుండగా రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్ బౌండరీ వాల్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు దాదాపు 70 అడుగుల లోతైన నీటితో నిండిన పిట్(కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం తవ్విన బేస్‌మెంట్)లో పడిపోయింది.
స్విమ్మింగ్ రాకపోవడంతో యువరాజ్ కారు నుంచి బయటకు వచ్చి దాని రూఫ్‌పైకి ఎక్కాడు. తన తండ్రి రాజ్ మెహతాకు ఫోన్ చేసి.. 'డాడ్, నేను లోతైన పిట్‌లో నీటిలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి రండి.. నన్ను కాపాడండి. నేను చావాలనుకోవడం లేదు' అని అరిచాడు. అంతేకాదు.. ఫోన్ టార్చ్‌లైట్‌నూ ఆన్ చేసి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతని అరుపులు విని అటుగా వెళ్తున్న జనం సహా తండ్రి, పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కానీ దట్టమైన పొగమంచు వల్ల 10 మీటర్ల దూరం కూడా వాళ్లకు కనిపించలేదు.
కారు మునిగిపోతుండగా యువరాజ్ ప్రాణాలు దక్కించుకునేందుకు చివరి వరకూ పోరాడి చివరకు నీటి కుంటలో మునిగిపోయాడు. ఆ తర్వాత ప్రాాణాలు వదిలాడు. దాదాపు 4-5 గంటల తర్వాత(ఉదయం 4:30 గంటల ప్రాంతంలో) పోలీసులు, డైవర్లు, NDRF టీమ్‌లు కారును, యువరాజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కనాలెడ్జ్ పార్క్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువరాజ్ తండ్రి రాజ్ మెహతా(రిటైర్డ్ SBI డైరెక్టర్) దీనిపై ఫిర్యాదు చేస్తూ.. స్థానికులు ఎన్నోసార్లు రిఫ్లెక్టర్లు, బారికేడింగ్, సైనేజీ ఏర్పాటు చేయాలని నొయిడా అథారిటీ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అటు ఈ ప్రమాదం తర్వాత స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. అధికారులు ఆ కుంటను చెత్తతో నింపేశారన్న ఆరోపణలూ వచ్చాయి.
ఈ ఘటన దట్టమైన పొగమంచు సమయంలో రోడ్డు సేఫ్టీ, కన్‌స్ట్రక్షన్ సైట్ల వద్ద జాగ్రత్తలు, రిఫ్లెక్టర్లు లేకపోవడం వంటి సమస్యలను మళ్లీ ఎత్తిచూపింది. మరో నాలుగు రోజుల పాటు పొంగమంచు తీవ్రంగా ఉంటుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News