Share News

ఒడిశాలో అరుదైన ఒరంగుటాన్లు ప్రత్యక్షం.. రంగంలోకి అటవీశాఖ అధికారులు..

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:57 PM

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో ఐదు అరుదైన ఒరంగుటాన్లు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ వానరాలను మంగళవారం అర్ధరాత్రి వేళ స్థానికులు గుర్తించారు. అయితే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనేది మిస్టరీగా మారింది.

ఒడిశాలో అరుదైన ఒరంగుటాన్లు ప్రత్యక్షం.. రంగంలోకి అటవీశాఖ అధికారులు..
Odisha Orangutans

ఒడిశా: బాలాసోర్‌ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో ఐదు అరుదైన ఒరంగుటాన్లు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ వానరాలను మంగళవారం అర్ధరాత్రి వేళ స్థానికులు గుర్తించారు. వెంటనే రాష్ట్ర అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని సురక్షితంగా కాపాడారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐదు ఒరంగుటాన్లను భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌ జూకు తరలించారు.


ఈ ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (STF) దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా అడవి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ అధికారుల చేతికి చిక్కింది. ఇందులో వారికి కీలక ఆధారాలు లభించాయి. స్థానికులకు ఒరంగుటాన్లు కనిపించడానికి ముందు రోజు రాత్రి ఓ నల్లరంగు మహీంద్రా థార్‌ ఆ ప్రాంతంలో సంచరించినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. రాత్రి 11:25 గంటల సమయంలో వాహనం అటవీ ప్రాంతానికి వెళ్లి.. సుమారు 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చినట్లు రికార్డయ్యింది. దీంతో ఈ వాహనానికి ఒరంగుటాన్ల తరలింపుతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ అరుదైన కోతులను విమాన, రైలు లేదా జల మార్గాల ద్వారా ఒడిశాకు తీసుకొచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


ఒరంగుటాన్ల అంశంపై ఒడిశా అటవీ శాఖ మంత్రి గణేశ్‌రామ్‌ సింగ్‌ ఖుంటియా స్పందించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్రంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయాల వద్ద నమోదైన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో (WCCB)ను కోరినట్లు తెలిపారు. ఒక్కో ఒరంగుటాన్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. మరోవైపు, ఒరంగుటాన్లను ఎవరు తీసుకొచ్చారు, వాటి తరలింపు వెనుక ఉద్దేశం ఏమిటనే దానిపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆ ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టండి.. మంత్రి వ్యాఖ్యలు వైరల్..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రైల్వే మౌలిక వసతుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్..

Updated Date - Sep 09 , 2026 | 06:05 PM