Share News

ఆ ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టండి.. మంత్రి వ్యాఖ్యలు వైరల్..

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:53 PM

కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున వివాదంలో చిక్కుకున్నారు. హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్‌ను చెప్పులతో కొట్టాలని మంత్రి వ్యాఖ్యానించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

ఆ ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టండి.. మంత్రి వ్యాఖ్యలు వైరల్..
Karnataka Politics

బెంగళూరు: కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున వివాదంలో చిక్కుకున్నారు. హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్‌ను చెప్పులతో కొట్టాలని మంత్రి వ్యాఖ్యానించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేసింది. కాగా, హరిహరలో ఓ బహిరంగ కార్యక్రమంలో మంత్రి మల్లికార్జున మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియో ప్రకారం.. హరిహర ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తాగు, సాగు నీటి సమస్యను మంత్రి మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. భద్రా జలాశయం నుంచి తమ ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయాలని వారు కోరారు. తమకు తాగునీటితో పాటు పశువులకూ నీరు అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్‌ అన్నను కలిసి భద్రా నీటి కోసం విజ్ఞప్తి చేయగా.. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిని కలవాలని ఆయన సూచించారని మల్లికార్జునకు రైతన్నలు వివరించారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే హరీశ్‌ను ‘అన్న’ అని సంబోధించవద్దని రైతులకు సూచించడంతో పాటు.. ఆయనను చెప్పులతో కొట్టాలని మంత్రి అన్నట్లు వీడియోలో వినిపిస్తోంది.


మంత్రి మల్లికార్జున వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బీపీ హరీశ్ తీవ్రంగా స్పందించారు. రైతులు భద్రా నీటి కోసం మంత్రిని కలిస్తే అభ్యంతరకరంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. తనపై అసభ్య పదజాలం ఉపయోగించారని, దీనికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హరీశ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా ఖండించారు. ఓ ప్రజాప్రతినిధిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. భద్రా నీటి సమస్యతో రైతులు వస్తే సమస్యను పరిష్కరించాల్సింది పోయి రాజకీయ ప్రత్యర్థిపై దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. కాగా, వైరల్‌ అవుతున్న వీడియోకు సంబంధించి పూర్తి సందర్భం, దాని ప్రామాణికతపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

వారిపై ఉగ్ర కేసు ఎత్తివేయలేదు.. దర్యాప్తు కొనసాగుతోంది: ఎన్ఐఏ

మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు.. ఎస్-400, Su-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్..

Updated Date - Sep 09 , 2026 | 04:23 PM