Share News

వారిపై ఉగ్ర కేసు ఎత్తివేయలేదు.. దర్యాప్తు కొనసాగుతోంది: ఎన్ఐఏ

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:15 PM

అమెరికా దేశస్థుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌ సహా ఏడుగురు విదేశీయులపై ఉగ్రవాద ఆరోపణలను పూర్తిగా ఉపసంహరించుకోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

వారిపై ఉగ్ర కేసు ఎత్తివేయలేదు.. దర్యాప్తు కొనసాగుతోంది: ఎన్ఐఏ
NIA

న్యూఢిల్లీ: అమెరికా దేశస్థుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌ సహా ఏడుగురు విదేశీయులపై ఉగ్రవాద ఆరోపణలను పూర్తిగా ఉపసంహరించుకోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు నిందితులపై దేశంలోకి అక్రమంగా ప్రవేశం, నివాసం, సంచరించడం వంటి నేరాలు రుజువు అయ్యాయన్నారు. దీనికి సంబంధించి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ (ఐఎఫ్‌ఏ) కింద ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందని వెల్లడించారు.


భారత్‌లోని సాయుధ గ్రూపులతో సంబంధాలు, ఉగ్ర కుట్ర ఆరోపణలతో వాన్‌డైక్‌తో పాటు మరో ఆరుగురు విదేశీయులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ కేసులో మంగళవారం నాడు ఏడుగురిపై ఐఎఫ్‌ఏ చట్టంలోని సెక్షన్లు 21, 23 కింద ఆ సంస్థ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయితే ఇందులో ఉపా (UAPA) నిబంధనలను ప్రస్తావించకపోవడంతో ఉగ్రవాద ఆరోపణలను ఎన్‌ఐఏ ఎత్తివేసిందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై ఎన్‌ఐఏ వర్గాలు స్పందిస్తూ నిందితులపై ఉగ్రవాద దర్యాప్తును నిలిపివేయలేదని స్పష్టం చేశాయి. వారందరిపై యూఏపీఏ కింద దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నాయి. దర్యాప్తులో ఇప్పటివరకు స్పష్టంగా నిర్ధారణ అయిన నేరాలకు సంబంధించి మాత్రమే ప్రస్తుత ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు తెలిపాయి.


ఉపా కింద నేరం రుజువయ్యే ఆధారాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తే తదుపరి దశలో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉందని ఎన్‌ఐఏ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ప్రస్తుత ఛార్జ్‌షీట్‌లో ఉపా సెక్షన్లు లేకపోవడం కేసులోని ఉగ్రవాద కోణం పూర్తిగా ముగిసిందని అర్థం కాదని పేర్కొన్నాయి. సరైన ఆధారాలు లభిస్తే భవిష్యత్తులో ఉపా నిబంధనలనూ చేర్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు యాక్సిడెంట్‌లో యువతి మరణం.. 26 రోజుల తర్వాత బయటపడ్డ ట్విస్ట్..

'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'

Updated Date - Sep 09 , 2026 | 03:21 PM