Share News

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రైల్వే మౌలిక వసతుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్..

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:43 PM

దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే ఏడు హైడెన్సిటీ కారిడార్లను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రైల్వే మౌలిక వసతుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్..
Indian Railways Mega Expansion

న్యూఢిల్లీ: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే ఏడు హైడెన్సిటీ కారిడార్లను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సుమారు రూ.11 వేల కోట్ల విలువైన మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఢిల్లీ-హౌరా, హౌరా-ముంబై, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-గువాహటి, ఢిల్లీ-చెన్నై, హౌరా-చెన్నై, ముంబై-చెన్నై మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను నాలుగు లైన్లకు పెంచనున్నారు.


కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోని అనేక ప్రధాన నగరాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లోని 14 జిల్లాలకు లబ్ధి చేకూరనుంది. దాదాపు 4,790 గ్రామాలకు రైలు కనెక్టివిటీ, రవాణా సామర్థ్యం పెరగనుంది. అలాగే సుమారు 56 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. కాగా, ఢిల్లీ-హౌరా మార్గంలో కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, పాట్నా, ఆసన్‌సోల్ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గం మథుర, కోటా, రత్లాం, వడోదర, సూరత్‌లను కలుపుతుంది. ఢిల్లీ-చెన్నై మార్గంలో ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, విజయవాడ వంటి నగరాలు ఉన్నాయి. అలాగే ముంబై-చెన్నై మార్గం పుణె సహా పలు ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది.


అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గాల్లో ఇకపై రైళ్ల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గనున్నాయి. అదనపు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న మార్గాల్లో రైళ్ల సంఖ్యను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికుల రైళ్లతోపాటు సరకు రవాణా రైళ్లనూ మరింత సమర్థమంతంగా నడిపేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా ఈ మార్గాలు బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు తదితర కీలక వస్తువుల రవాణాకు అత్యంత కీలకమైనవి. మల్టీట్రాకింగ్ పనులు పూర్తయితే అదనంగా ఏడాదికి 27 మిలియన్ టన్నుల మేర సరకు రవాణా సామర్థ్యం పెరగనుంది.


ఈ సందర్భంగా రైల్వే మౌలిక వసతుల విస్తరణపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏళ్లుగా రైల్వే ఆధునికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ఏడు ప్రధాన రైల్వే కారిడార్లను నాలుగు లైన్లుగా విస్తరించడంతోపాటు భవిష్యత్తులో అధిక రవాణా అవసరం ఉన్న మరిన్ని మార్గాల అభివృద్ధిపైనా దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు.


తెలుగు రాష్ట్రాలకు లబ్ధి..

కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుంది. హౌరా-చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా నాలుగు లైన్ల నిర్మాణం జరగనుంది. ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లైన్లు రానున్నాయి. అలాగే ఘట్‌కేసర్‌- కాజీపేట పరిధిలో నాలుగో లైన్‌ను రూ.2,418 కోట్లతో 110 కి.మీ. మేర నిర్మించనున్నారు. మరోవైపు, అరక్కోణం-రేణిగుంట సెక్షన్‌లోనూ మూడేళ్లలో 3, 4 లైన్ల నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

వారిపై ఉగ్ర కేసు ఎత్తివేయలేదు.. దర్యాప్తు కొనసాగుతోంది: ఎన్ఐఏ

ఆ ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టండి.. మంత్రి వ్యాఖ్యలు వైరల్..

Updated Date - Sep 09 , 2026 | 05:11 PM