Share News

బిహార్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:57 PM

బిహార్ రాష్ట్రం బెగుసరాయ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె మర్మాంగంలో పలు రకాల వస్తువులు పెట్టి వికృతంగా ప్రవర్తించారు.

బిహార్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..
Bihar Crime News

బిహార్: బెగుసరాయ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా లైంగిక దాడి చేశారు. అత్యాచారం చేయడమే కాకుండా ఆమె మర్మాంగంలో పలు రకాల వస్తువులు పెట్టి వికృతంగా ప్రవర్తించారు. వారి చేష్టలతో తీవ్రంగా గాయపడిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


ఈ ఘటన జూన్ 11 అర్థరాత్రి చకియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ రోజు రాత్రి సుమారు 11:30 గంటలకు బాధితురాలు మూత్ర విసర్జన కోసం బాత్రూమ్‌కి వెళ్లింది. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు ఆమె భర్తను ఓ గదిలో బంధించారు. మహిళ బయటకు రాగానే గట్టిగా పట్టుకుని, నోటికి గుడ్డ కట్టారు. అనంతరం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించగా బ్లేడ్‌తో ఆమె ఛాతి, తొడలపై తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత మరింత వికృత చేష్టలకు దిగారు.


బాధిత మహిళ స్పృహ కోల్పోయినా వదిలిపెట్టకుండా ఆమె మర్మాంగంలో బుల్లెట్, రాయి, చెక్క ముక్క వంటి వస్తువులు పెట్టారు. లైంగిక దాడి తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు తన బంధువులకు ఫోన్ చేసింది. వారు వచ్చి మహిళను, ఆమె భర్తను రక్షించారు. బాధితురాలి భర్త వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారి సూచనల మేరకు చికిత్స నిమిత్తం బరౌని ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం బరౌని నుంచి సదర్ ఆస్పత్రికి ఆమెను పోలీసులు తరలించారు. చికిత్స తర్వాత బాధితురాలిని ఇంటికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అయితే, మర్మాంగంలో విపరీతంగా నొప్పి రావడంతో సదర్ ఆస్పత్రికి బాధిత మహిళ మళ్లీ వెళ్లింది. వైద్య పరీక్షలో భాగంగా ఆమె మర్మాంగంలో తూటా, రాయి, చెక్క ముక్కను గుర్తించిన వైద్యులు షాక్ అయ్యారు. అనంతరం వాటిని తొలగించారు. ఇదే విషయాలను మీడియాకు చెబుతూ బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. మూడు నెలల కిందట కూడా ఇలాంటి ఘటన జరిగినట్లు చెప్పుకొచ్చింది. ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి కొట్టారని.. డబ్బు, నగలతో పారిపోయే ముందు తనపై అత్యాచారానికి ప్రయత్నించారని పేర్కొంది. ఈ విషయం పోలీసులకు తెలియజేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


మరోవైపు అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, గత సంఘటనపైనా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, మహిళపై సామూహిక అత్యాచారం ఘటన ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. మహిళల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

ప్రేమ పేరిట మైనర్లతో శారీరక సంబంధం క్షమార్హం కాదు: కేరళ హైకోర్టు తీర్పు

Updated Date - Jun 18 , 2026 | 07:45 PM