Share News

ప్రేమ పేరిట మైనర్లతో శారీరక సంబంధం క్షమార్హం కాదు: కేరళ హైకోర్టు తీర్పు

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:02 PM

టీనేజ్‌లో సాగే ప్రేమకథలు, మైనర్లతో కూడిన శారీరక సంబంధాలపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో 'పోక్సో' చట్టం నుంచి ఎలాంటి మినహాయింపు లభించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్రేమ పేరిట మైనర్లతో శారీరక సంబంధం క్షమార్హం కాదు: కేరళ హైకోర్టు తీర్పు
Kerala High Court Rules Minor's Consent Invalid Under POCSO, Reduces Jail Term in Teenage Love Case

కొచ్చి(కేరళ), జూన్ 18: టీనేజ్‌‌లో సాగే ప్రేమకథలు, మైనర్లతో కూడిన శారీరక సంబంధాలపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నప్పటికీ, మైనర్లతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే 'పోక్సో' (POCSO) చట్టం నుంచి ఎలాంటి మినహాయింపు లభించదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, టీనేజర్ల మనస్తత్వం, ఆ వయసులో వచ్చే హార్మోన్ల మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. నిందితుడి భవిష్యత్తు పూర్తిగా నాశనం కాకూడదనే ఉద్దేశంతో శిక్షా కాలాన్ని తగ్గిస్తూ వినూత్న నిర్ణయం తీసుకుంది.


కేసు నేపథ్యం ఏమిటి?

2017లో 19 ఏళ్ల ఒక యువకుడు, 14 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సదరు యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ పీ.జీ. అజిత్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పును వెలువరించింది.

మైనర్ల 'అంగీకారానికి' చట్టబద్ధత లేదని చెప్పిన కోర్టు.. 'మేము ఇద్దరం ప్రేమించుకున్నాం.. ఇష్టపూర్వకంగానే కలిసున్నాం' అని చెబితే చట్టం ఒప్పుకోదని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం మైనర్ల అంగీకారానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, కాబట్టి అది కచ్చితంగా పోక్సో చట్టం కింద నేరమే అవుతుందని తేల్చి చెప్పింది. టీనేజ్‌లో ఉండే ఉడుకు రక్తం, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్లే యువత విచక్షణ కోల్పోయి, ఆవేశంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

ఇదే సందర్భంలో నిందితుడు ప్రొఫెషనల్ క్రిమినల్ కాదని కోర్టు గుర్తించింది. జైలు శిక్ష కారణంగా అతని జీవితం, భవిష్యత్తు పూర్తిగా నాశనం కాకూడదని భావించిన న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు విధించిన 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను 4 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 06:17 PM